గంగూలీ ఢిల్లీని నడిపిస్తున్నాడా?

22 Sep, 2020 02:57 IST|Sakshi

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వ్యాఖ్యలతో సందేహాలు

దుబాయ్‌: బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఐపీఎల్‌లో సౌరవ్‌ గంగూలీ వెనకనుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సహకారం అందిస్తున్నాడా? నిబంధన ప్రకారం ఇది కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ కిందకు రాదా? ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌ అనంతరం క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణంగా నిలిచాయి. పైగా ఇతర ఫ్రాంచైజీలు, బోర్డులోని కొందరు సభ్యులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత ఏడాది జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం కాబట్టి గౌరవపూర్వకంగా గంగూలీకి కృతజ్ఞతలు చెబితే సమస్య ఉండకపోయేది కానీ అతని మాటల్లో తాజా సీజన్‌ గురించి చెప్పినట్లుగా వినిపించింది.

తన కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ అయ్యర్‌... ‘ఒక కెప్టెన్‌కు ఉత్సాహం, పట్టుదలవంటి లక్షణాలు ఉండాలి. గత కొన్నేళ్లుగా ఇలాంటివి నేను అలవర్చుకున్నాను. అయినా మన చుట్టూ పాంటింగ్‌ (జట్టు హెడ్‌ కోచ్‌), గంగూలీ స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు సహజంగానే మన పని సులువవుతుంది’ అని అయ్యర్‌ వ్యాఖ్యానించాడు. బోర్డు అధ్యక్షుడు ఒక ఫ్రాంచైజీతో ఇలా అనుబంధం కొనసాగించడం సరైంది కాదని బీసీసీఐ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యవహారం లీగ్‌కు చెడ్డ పేరు తెస్తుందని చెప్పారు. గంగూలీపై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్త కాదు.  ఐపీఎల్‌కు డ్రీమ్‌11 టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా దాని పోటీ ఫాంటసీ క్రికెట్‌ యాప్‌ మై సర్కిల్‌ 11కు... భారత క్రికెట్‌ జట్టు స్పాన్సర్‌ బైజూస్‌కు పోటీ అయిన ఆన్‌లైన్‌ టీచింగ్‌ కంపెనీ అన్‌ అకాడమీకి గంగూలీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. భారత క్రికెట్‌ జట్టు స్పాన్సర్లలో ఒకటైన అంబుజా సిమెంట్‌ పోటీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌కు అతను ప్రచారం చేయడం కూడా తప్పని విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు