‘రివర్స్‌ ల్యాప్‌’ షాట్‌: రిస్క్‌ చేయడం తనకు అలవాటే!

16 Jun, 2021 17:37 IST|Sakshi

లగాన్‌కు 20 ఏళ్లు పూర్తి: మీమ్‌తో ఆకట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

లండన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లండ్‌కు చేరుకున్న టీమిండియా బృందం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రెండు జట్లుగా విడిపోయి మెగా టోర్నీ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లలో టీమిండియా వికెట్‌ కీపర్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అద్భుత శతకంతో పాటు సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది కూడా. ఇక కరోనా కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అర్ధంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ ఆటగాళ్లకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ పలు ఫ్రాంఛైజీలు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాయి. 

ఇందులో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తమ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ సూపర్‌ ఫాంను ఉటంకిస్తూ మంగళవారం షేర్‌ చేసిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇండియన్‌ ఐకానిక్‌ మూవీ ‘లగాన్‌’ విడుదలై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ పోస్టు పెట్టింది. ఇందులో.. సినిమాలోని క్యారెక్టర్‌ గురాన్‌(రాజేశ్‌ వివేక్‌) పట్టుదలగా బ్యాట్‌తో నిలబడిన ఫొటోను, పంత్‌ రివర్స్‌ షాట్‌ ఆడుతున్న ఫొటోను జతచేసి .. ‘‘రిస్క్‌ చేసే గుణం.. ఆ వారసత్వం అలాగే కొనసాగుతుంది’’ అంటూ చమత్కరించింది. ఇందుకు స్పందనగా.. ‘‘ పరిగెత్తే గుర్రం లాంటి వాడు పంత్‌.. తన దూకుడైన ఆట మాకెంతగానో ఇష్టం.. మీ క్రియేటివిటీ సూపర్‌’’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

ఆనాటి సూపర్‌ షాట్‌
ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగో టెస్టులో పంత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఫొటో అది. ఇన్నింగ్స్‌ 83వ ఓవర్‌లో... తళతళ మెరుస్తున్న కొత్త బంతితో అండర్సన్‌ వేసిన ఫుల్‌ బాల్‌ను పంత్‌ స్లిప్‌ మీదుగా ‘రివర్స్‌ ల్యాప్‌’ షాట్‌తో బౌండరీకి తరలించాడు. తేడా వస్తే పంత్‌ గాయపడే అవకాశం ఉన్నా అతడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అసలు ఈ షాట్‌ ఎలా ఆడగలిగాడు అన్నట్లుగా స్వయంగా అండర్సన్‌ మొహం మాడ్చుకున్న దృశ్యాలు నెటిజన్లకు వినోదం పంచాయి. 

చదవండి: శతక్కొట్టిన పంత్‌.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్‌

మరిన్ని వార్తలు