మరో సూపర్ మ్యాచ్‌ జరిగేనా?

20 Oct, 2020 19:51 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిని ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి అంచె‌ లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్‌ ఓవర్లో‌ గెలిచింది. ఈ సీజన్‌ ఆరంభంలో‌ ఢిల్లీ-పంబాబ్‌ల మధ్య రెండో మ్యాచ్‌ జరగ్గా అది సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవగా,  కింగ్స్‌ పంజాబ్‌కు చుక్కెదురైంది. కాగా, మళ్లీ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు యమ క్రేజ్‌ ఏర్పడింది. ఇరుజట్లలో స్టార్‌ ఆటగాళ్లు ఉండటంతో మరో సూపర్‌ మ్యాచ్‌ అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఇప్పటివరకూ ఢిల్లీ 9 మ్యాచ్‌లకు గాను 7 విజయాలు సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ 9 మ్యాచ్‌లకు 3 విజయాలే సాధించింది.  ఇక ఓవరాల్‌గా ఇరుజట్లు 25సార్లు ముఖాముఖి పోరులో తలపడగా అందులో కింగ్స్‌ పంజాబ్‌ 14 సార్లు గెలవగా, ఢిల్లీ 11 సార్లు మాత్రమే విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌లను కింగ్స్‌ గెలవడంతో ఆ జట్టు మంచి జోష్‌ మీద కనిపిస్తోంది. ఆర్సీబీపై గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఢిల్లీ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలను ఖాతాలో వేసుకుంది. సీఎస్‌కేతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ మూడు సిక్స్‌లతో జట్టును గెలిపించాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌లో అక్షర్‌ బ్యాట్‌ ఝుళిపించి ఓటమి అంచు నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌ 525 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ 393 పరుగులు సాధించగా,  నికోలస్‌ పూరన్‌ 242 పరుగులు సాధించాడు. ఇక పంజాబ్‌ జట్టులో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో మహ్మద్‌ షమీ 14 వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్‌ 9 వికెట్లు సాధించాడు. మురుగన్‌ అశ్విన్‌ 6 వికెట్లు తీశాడు. ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో శిఖర్‌ ధావన్‌ 359 పరుగులతో ఉండగా, శ్రేయస్‌ అయ్యర్‌ 321 పరుగులు సాధించాడు. స్టోయినిస్‌ 217 పరుగుల్ని నమోదు చేశాడు. బౌలింగ్‌ విభాగంలో కగిసో రబడా 19 వికెట్లతో టాప్‌ లేపగా, నోర్జే 12 వికెట్లు , అక్షర్‌ పటేల్‌ 7 వికెట్లు సాధించారు.

రాహుల్‌ వర్సెస్‌ రబడా
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రాహుల్‌ బ్యాటింగ్‌లో టాప్‌ లేపుతుంటే, బౌలింగ్‌లో రబడా విశేషంగా రాణిస్తున్నాడు. నేటి మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. రాహుల్‌ 135.65 స్టైక్‌రేట్‌తో పాటు 75.00 యావరేజ్‌తో 525 పరుగులు సాధించగా, రబడా 7.68 ఎకానమీతో 19  వికెట్లు సాధించాడు. ఇరుజట్ల మధ్య గత మ్యాచ్‌లో రాహుల్‌, పూరన్‌లను సూపర్‌ ఓవర్‌లో ఔట్‌ చేసిన రబడా ఢిల్లీ విజయంలో  కీలక పాత్ర పోషించాడు. 

మరిన్ని వార్తలు