Wrestler Sushil Kumar: సుశీల్‌ చిక్కాడు...

24 May, 2021 05:22 IST|Sakshi
పోలీసుల అదుపులో సుశీల్‌ కుమార్‌

ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డ భారత స్టార్‌ రెజ్లర్‌

ఆదివారం ఢిల్లీ శివారులో అరెస్ట్‌ చేసిన ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు

ఆరు రోజులు పోలీసు కస్డడీకి రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసు

న్యూఢిల్లీ: పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసినా... కోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించినా... యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో 19 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్‌ కుమార్, అతడి అనుచరుడు అజయ్‌ కుమార్‌ను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం సుశీల్, అజయ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్‌ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు.  

ఏం జరిగిందంటే...
ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్‌ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ సాగర్‌ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్‌ కుమార్‌లతో సుశీల్‌ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్‌ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సోనూ, అమిత్‌ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్‌లతో కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్‌ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్‌ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్‌ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్‌ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్‌ 14 వేర్వేరు సిమ్‌ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్‌ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆఖరికి ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులో తన అనుచరుడు అజయ్‌తో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులకు సుశీల్‌ చిక్కాడు.

ఖేల్‌ ఖతమ్‌!
అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన 37 ఏళ్ల సుశీల్‌ కుమార్‌ పరువు, ప్రతిష్ట తాజా ఉదంతంతో మసకబారిపోయింది. ఈ హత్యతో తనకు సంబంధంలేదని సుశీల్‌ వివరణ ఇస్తున్నాడు. అయితే అతనికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. నార్నర్త్‌ రైల్వేలో సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ అయిన సుశీల్‌ ఐదేళ్లుగా ఛత్రశాల్‌ స్టేడియంలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నాడు.

అయితే సుశీల్‌ సమక్షంలోనే గొడవ జరగడం... సాక్ష్యాలూ ధ్వంసం కావడం... ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరు ఉండటం.. తాజాగా అరెస్టు కూడా కావడంతో సుశీల్‌ ఉద్యోగం ఊడే అవకాశముంది. ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన సుశీల్‌... తాజా సంఘటనతో భవిష్యత్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడిందనే చెప్పాలి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సుశీల్‌ 20వ స్థానంలో నిలిచాడు.

సుశీల్‌ ఘనతలు
     2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం.
     2010 ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం.  
     2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు
     2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం.
     ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం (2010), రజతం (2007), రెండు కాంస్యాలు (2003, 2008).
     కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో (2003, 2005, 2007, 2009, 2017) ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం (2005).
     1998, 1999 ప్రపంచ క్యాడెట్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు.

అవార్డులు
అర్జున అవార్డు: 2005; రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న:
2009; పద్మశ్రీ: 2011

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు