శ్రీకాంత్‌ ఆరో‘సారీ’...

17 Oct, 2020 06:00 IST|Sakshi

చౌ తియెన్‌ చెన్‌ చేతిలో మళ్లీ ఓడిన భారత షట్లర్‌

డెన్మార్క్‌ ఓపెన్‌లో ముగిసిన పోరు

ఒడెన్స్‌: ఏడు నెలల తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్, ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 22–20, 13–21, 16–21తో ఓడిపోయాడు. చౌ తియెన్‌ చెన్‌ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. శ్రీకాంత్‌ ఏకైకసారి 2014లో హాంకాంగ్‌ ఓపెన్‌లో చౌ తియెన్‌ చెన్‌పై గెలిచాడు.

ఆ తర్వాత ఈ చైనీస్‌ తైపీ ప్లేయర్‌తో తలపడిన ఆరుసార్లూ (2015 వరల్డ్‌ సూపర్‌సిరీస్‌ ఫైనల్స్‌; 2017 వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌; 2018 చైనా ఓపెన్‌; 2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌; 2020 మలేసియా మాస్టర్స్‌ టోర్నీ; 2020 డెన్మార్క్‌ ఓపెన్‌) శ్రీకాంత్‌ను పరాజయమే పలకరించింది. 62 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... రెండో గేమ్‌ నుంచి ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ తడబడ్డాడు. ఒకదశలో 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్‌ ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌ లోనూ తియెన్‌ చెన్‌ పైచేయి సాధించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 4,125 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 6,050 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు