పడిక్కల్‌కు పాజిటివ్‌

5 Apr, 2021 04:47 IST|Sakshi

క్వారంటైన్‌లో ఆర్‌సీబీ ప్లేయర్‌

ఐపీఎల్‌కు కరోనా దెబ్బ

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కష్టకాలం వచ్చింది. ఈ లీగ్‌పై కరోనా వైరస్‌ పడగ విప్పినట్లుంది. అందుకే ఆటగాళ్లు, గ్రౌండ్‌ సిబ్బంది, ఈవెంట్‌ మేనేజర్లు వరుసగా కోవిడ్‌–19 వైరస్‌ బారిన పడుతున్నారు. తాజా పరిణామాలు, పాజిటివ్‌ రిపోర్టులు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌కి ఈ మహమ్మారి సోకింది. గత నెల 22న అతని నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో 20 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్‌ను బెంగళూరులోని తన స్వగృహంలో క్వారంటైన్‌లో ఉంచారు.

క్వారంటైన్‌ గడువు ముగిశాక వరుసగా రెండు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలితే అతన్ని బయో బబుల్‌లోకి తీసుకుంటామని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌సీబీ మెడికల్‌ టీమ్‌ అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని అందులో పేర్కొంది. క్వారంటైన్‌ నేపథ్యంలో పడిక్కల్‌ ఈ నెల 9న జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. చెన్నైలో మొదలయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆర్‌సీబీ తలపడుతుంది. లీగ్‌ ప్రారంభం కాకముందే కరోనా బారిన పడ్డ క్రికెటర్ల సంఖ్య మూడుకి చేరింది. నితీశ్‌ రాణా (కోల్‌కతా నైట్‌రైడర్స్‌) కరోనా నుంచి కోలుకోగా... అక్షర్‌ పటేల్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌) ఐసోలేషన్‌లో ఉన్నాడు.  

ముంబై వేదికని మార్చలేదు: రాజీవ్‌ శుక్లా
మహారాష్ట్రలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలతో ముందుకెళ్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా అన్నారు. ‘ముంబై వేదికని మార్చే నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్‌ ప్రకారం అక్కడే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయో బబుల్‌ కూడా ఉంది. కేసుల తీవ్రత పెరిగితే తప్ప స్టాండ్‌బై వేదికలు (హైదరాబాద్, ఇండోర్‌) పరిశీలించం’ అని శుక్లా తెలిపారు.

మరిన్ని వార్తలు