'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' అవార్డు గెలుచుకున్న కివీస్‌ ఓపెనర్‌

12 Jul, 2021 16:31 IST|Sakshi

దుబాయ్‌: జూన్‌ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ అవార్డు న్యూజిలాండ్ నయా బ్యాటింగ్‌ సెన్సేషన్‌ డెవాన్ కాన్వేను వరించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం కాన్వేతో పాటు న్యూజిలాండ్ ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమీసన్‌, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డికాక్ పోటీపడినప్పటికీ.. ఐసీసీ కాన్వే వైపే మొగ్గు చూపింది. దీంతో పురుషుల విభాగంలో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి కివీస్‌ ప్లేయర్‌గా కాన్వే చరిత్ర పుటల్లోకెక్కాడు. జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వే.. అరంగేట్రం టెస్ట్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ విలువైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన కాన్వే.. మొత్తం మూడు టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలను నమోదు చేశాడు. 

మరోవైపు మహిళల క్రికెట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా(జూన్‌) ఇంగ్లండ్ స్పిన్న‌ర్ సోఫీ ఎక్లెస్టోన్ నిలిచింది. ఈ అవార్డు రేసులో టీమిండియా నవయువ బ్యాటర్‌ షెఫాలీ వ‌ర్మ‌, సహచర ప్లేయర్‌ స్నేహ్ రాణా ఉన్నప్పటికీ.. ఎక్లెస్టోన్‌ వీరిద్దరినీ వెన‌క్కి నెట్టి ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచింది. దీంతో టీమిండియా ప్లేయర్స్‌కు మరోసారి మొండిచెయ్యే మిగిలింది. భారత్‌తో జ‌రిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లు, ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు వ‌న్డేల్లో మూడేసి వికెట్లు తీసిన ఎక్లెస్టోన్‌.. అత్యధిక రేటింగ్‌ పాయింట్లు సాధించి ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కైవసం చేసుకుంది. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ ద్వారా టెస్ట్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షెఫాలి వర్మ.. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసి శభాష్‌ అనిపించుకుంది. ఇదే టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా బంతితోనూ, బ్యాట్‌తోనూ రాణించి, భారత్ జట్టును ఓటమి బారి నుంచి రక్షించింది.
 

మరిన్ని వార్తలు