Dhiraj Bommadevara: రెండో రౌండ్‌లో ధీరజ్

23 Apr, 2021 05:33 IST|Sakshi

గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో ధీరజ్‌ 6–0తో జోస్‌ కార్లోస్‌ లోపెజ్‌ (గ్వాటెమాలా)పై విజయం సాధించాడు. ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌ సెట్స్‌’ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక్కో సెట్‌లో ఆర్చర్లకు మూడు బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. మూడు బాణాలు సంధించాక అత్యధిక స్కోరు సాధించిన ఆర్చర్‌ సెట్‌ను గెలిచినట్టు. సెట్‌ గెలిస్తే రెండు పాయింట్లు... స్కోరు సమం అయితే ఇద్దరికీ చెరో పాయింట్‌ ఇస్తారు.

ధీరజ్‌ తొలి సెట్‌ను 28–23తో... రెండో సెట్‌ను 30–27తో... మూడో సెట్‌ను 27–24తో గెలిచి ఓవరాల్‌గా 6–0తో విజయాన్ని అందుకున్నాడు. భారత్‌కే చెందిన తరుణ్‌దీప్‌ రాయ్‌ 6–0తో ఇవాన్‌ గొంజాలెజ్‌ (మెక్సికో)పై గెలుపొందగా... ప్రవీణ్‌ జాదవ్, అతాను దాస్‌లకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు దీపిక, అంకిత, కోమలిక, మధు వేద్వాన్‌లకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది.

మరిన్ని వార్తలు