ఎంఎస్‌ ధోని మరో రికార్డు

4 Oct, 2020 23:20 IST|Sakshi
సామ్‌ కరాన్‌-ధోని(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో  వంద క్యాచ్‌లను అందుకున్న రెండో వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ మార్కును చేరాడు. కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్‌ కొట్టి పట్టడంతో ధోని వంద క్యాచ్‌ల ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా ఈ లీగ్‌లో అత్యధిక వికెట్‌ కీపర్‌ క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక్కడ కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ తొలి వికెట్‌ కీపర్‌ కాగా, ఆ తర్వాత ధోని దాన్ని సాధించాడు. 2017లో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ వంద వికెట్‌ కీపర్‌ క్యాచ్‌ల ఘనతను సాధించాడు. ఇక అత్యధిక ఔట్లలో భాగమైన వికెట్‌ కీపర్లలో మాత్రం ధోని తొలి స్థానంలో ఉన్నాడు. ధోని 139 ఔట్లలో భాగమయ్యాడు. క్యాచ్‌లు, స్టంపౌట్‌లతో కలుపుకుని దీన్ని సాధించాడు. ఈ జాబితాలో కార్తీక్‌ 133 ఔట్లలో భాగమై రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన సీఎస్‌కే.. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్‌ వాట్సన్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ మళ్లీ రాణించడంతో సీఎస్‌కే  విజయాన్ని అందుకుంది. వాట్సన్‌(83 నాటౌట్‌; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్‌(87 నాటౌట్‌; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్‌)లు కడవరకూ క్రీజ్‌లో ఉండి విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు