IPL 2022: ధోని ఫినిషింగ్‌ టచ్‌.. ముంబై ‘ఏడు’పు..!

22 Apr, 2022 05:38 IST|Sakshi

చెన్నైని గెలిపించిన ధోని

3 వికెట్లతో రోహిత్‌ బృందం పరాజయం

తిలక్‌ వర్మ అర్ధ సెంచరీ

IPL 2022 CSK Vs MI- ముంబై: 156 పరుగులను అందుకునే క్రమంలో చెన్నై తడబాటు...మ్యాచ్‌లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగా ముంబైకే గెలుపు అవకాశాలు...మ్యాచ్‌ గెలిచి లీగ్‌లో రోహిత్‌ సేన బోణీ కొట్టేలా కనిపించింది. 5 బంతుల్లో చెన్నై చేయాల్సినవి 17 పరుగులు... అప్పుడే క్రీజులోకి వచ్చిన బ్రేవో పరుగు తీసి ధోనికి స్ట్రయిక్‌ ఇచ్చాడు. 4 బంతుల్లో 16 పరుగులు కావాలి.

కానీ చాలా కాలంగా బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ధోని సామర్థ్యంపై కొంత అనుమానం! మరి ఇంకెమవుతుందోనన్న టెన్షన్‌ ఇరు శిబిరాల్లోనూ ఉంది. ఉనాద్కట్‌ మూడో బంతిని ధోని లాంగాఫ్‌లో సిక్సర్‌గా బాదాడు. ఎక్కడలేని ఆశలు. 4వ బంతికి ఫోర్‌. 2 బంతుల్లో 6 పరుగులు కావాలి.

ఐదో బంతికి చకచకా 2 పరుగులు పూర్తి. ఓ బంతి 4 పరుగులు. కొట్టేశాడు ధోని...ఒకనాటి తన ఆటను గుర్తు చేస్తూ ముంబైని మట్టికరిపించాడు! ధోని ఆడిన ఆఖరి 4 బంతులు సూపర్‌కింగ్స్‌ను 3 వికెట్ల తేడాతో గెలిపించాయి. మొదట ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఠాకూర్‌ తిలక్‌ వర్మ (43 బంతుల్లో 51 నాటౌట్‌; 3ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముకేశ్‌ చౌదరి 3 కీలక వికెట్లు తీశాడు.

తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (35 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, ధోని (13 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అసలైన ఇన్నింగ్స్‌ ఆడాడు. డానియెల్‌ సామ్స్‌కు 4 వికెట్లు దక్కాయి.  

జీరో... జీరో!
ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌ చూస్తే... ఈ జట్టా ‘5 స్టార్‌ చాంపియన్‌’ అని సందేహం కలుగకమానదు. ఐదు సార్లు ఐపీఎల్‌ను గెలిపించిన సారథి, ఓపెనింగ్‌లో విశేష అనుభవజ్ఞుడైన రోహిత్‌ శర్మ (0) ఆట మొదలైన రెండో బంతికే అవుటైతే... యువ డాషింగ్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ రెండు వికెట్లను అనామక బౌలరైన ముకేశ్‌ చౌదరి తీయడం విశేషం. రెండో ఓవర్లోనే జడేజా క్యాచ్‌ జారవిడవడంతో వచ్చిన లైఫ్‌ను బ్రెవిస్‌ (4) సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ముకేశ్‌కు మూడో వికెట్‌గా ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లలో పరుగులు చేసి అవుటైంది అతనొక్కడే!  సూర్యకుమార్, తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ ఓ నాలుగు ఓవర్లపాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అడపాదడపా బౌండరీలతో వేగంగా ఆడుతున్న సూర్యకుమార్‌ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) సాన్‌ట్నర్‌ అవుట్‌ చేశాడు. జట్టు 50 పరుగులైనా చేయకమందే 47 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

తిలక్‌ నిలబడటంతో...
క్రమం తప్పకుండా వికెట్లు రాలుతున్నా చెక్కు చెదరని ఏకాగ్రతతో తిలక్‌వర్మ బ్యాటింగ్‌ సాగింది. ఇతనికి హృతిక్‌ షౌకీన్‌ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు) జతయినా వంద పరుగులకంటే ముందే అతనూ పెవిలియన్‌ బాటపట్టాడు. తర్వాత పొలార్డ్‌ తోడయ్యాక 15వ ఓవర్‌ ఆఖరి బంతికి ముంబై 100 పరుగులకు చేరింది. కానీ పొలార్డ్‌ (14) మిగిలిన ఆ కాసిన్ని ఓవర్లు ఆడలేకపోయాడు. భారీషాట్‌కు యత్నించి లాంగాన్‌లో శివమ్‌ దూబేకు క్యాచిచ్చాడు. 42 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్న తిలక్‌ అజేయంగా నిలువగా, ఉనాద్కట్‌ (9 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్‌) ఆఖర్లో మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఫీల్డింగ్‌ చెత్తగా ఉంది. జడేజా, బ్రేవో, శివమ్‌ దూబే సునాయాసమైన క్యాచ్‌లను నేలపాలు చేశారు.

చెన్నై కష్టపడి...
ఏమంత కష్టమైన లక్ష్యం కానేకాదు. అయినా చెన్నై సునాయాసంగా లక్ష్యం చేరలేదు. రుతురాజ్‌ (0)ను సామ్స్‌ తొలి బంతికే పెవిలియన్‌ చేర్చాడు. ఉతప్ప (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడితే సాన్‌ట్నర్‌ (11), శివమ్‌ దూబే (13), రవీంద్ర జడేజా (3) నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నాడు. ఉన్నంతలో రాయుడు మెరుగైన ఆటతీరు కనబరిచాడు. కానీ ఈ 6 విలువైన వికెట్లన్నీ 106 స్కోరు వరకే పడిపోయాయి. 24 బంతుల్లో 48 పరుగుల సమీకరణం. ప్రిటోరియస్‌ (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో చెన్నై లక్ష్యం బాట పట్టింది. కానీ ఆఖరి ఓవర్‌ తొలిబంతికి అతను అవుటై ఆ జట్టు శిబిరంలో గుబులు రేపాడు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) సాన్‌ట్నర్‌ (బి) ముకేశ్‌ 0; ఇషాన్‌ (బి) ముకేశ్‌ 0; బ్రెవిస్‌ (సి) ధోని (బి) ముకేశ్‌ 4; సూర్యకుమార్‌ (సి) ముకేశ్‌ (బి) సాన్‌ట్నర్‌ 32; తిలక్‌ నాటౌట్‌ 51; హృతిక్‌ (సి) ఉతప్ప (బి) బ్రేవో 25; పొలార్డ్‌ (సి) దూబే (బి) తీక్షణ 14; సామ్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) బ్రేవో 5; ఉనాద్కట్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1–0, 2–2, 3–23, 4–47, 5–85, 6–111, 7–120.
బౌలింగ్‌: ముకేశ్‌ 3–0–19–3, సాన్‌ట్నర్‌ 3–0–16–1, తీక్షణ 4–0–35–1, జడేజా 4–0–30–0, ప్రిటోరియస్‌ 2–0–17–0, బ్రేవో 4–0–36–2.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) తిలక్‌ (బి) సామ్స్‌ 0; ఉతప్ప (సి) బ్రెవిస్‌ (బి) ఉనాద్కట్‌ 30; సాన్‌ట్నర్‌ (సి) ఉనాద్కట్‌ (బి) సామ్స్‌ 11; రాయుడు (సి) పొలార్డ్‌ (బి) సామ్స్‌ 40; దూబే (సి) ఇషాన్‌ (బి) సామ్స్‌ 13; జడేజా (సి) తిలక్‌ (బి) మెరిడిత్‌ 3; ధోని నాటౌట్‌ 28; ప్రిటోరియస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉనాద్కట్‌ 22; బ్రేవో నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156.
వికెట్ల పతనం: 1–0, 2–16, 3–66, 4–88, 5–102, 6–106, 7–139.
బౌలింగ్‌: సామ్స్‌ 4–0–30–4, బుమ్రా 4–0–29–0, మెరిడిత్‌ 4–0–25–1, ఉనాద్కట్‌ 4–0–48–2, హృతిక్‌ 4–0–23–0.  
 
ఐపీఎల్‌లో నేడు

ఢిల్లీ X రాజస్తాన్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు