MS Dhoni Police Look: ‘హీరో’కు ఏమాత్రం తీసిపోడు! ఏం మాట్లాడుతున్నారు? నిజంగానే.. 

3 Feb, 2023 14:11 IST|Sakshi

MS Dhoni New Look Viral: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిల్స్‌ అందించిన ఈ మిస్టర్‌ కూల్‌కు కోట్లాది మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నప్పటికీ అతడికి ఉన్న ఫాలోయింగ్‌ ఇసుమంత కూడా తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ధోని.. ఇప్పటికీ తన ఆటతో అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల రాంచిలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా అక్కడికి రాగా తలా.. తన ఎంట్రీతో భారత ఆటగాళ్లను సర్‌ప్రైజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా తన సతీమణి సాక్షితో కలిసి సొంతమైదానంలో జరుగుతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. దీంతో కెమెరాలన్నీ ధోనిపైనే ఫోకస్‌ అయ్యాయంటే అతడి మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీస్‌ డ్రెస్‌లో
పోలీస్‌ డ్రెస్‌లో లాఠీ చేతబట్టి సహచరులతో కలిసి ధోని నడుస్తున్నట్లుగా ఉన్న ఆ చిత్రం అభిమానులను కట్టిపడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘సినీ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాడు. సింగం సిరీస్‌లో తదుపరి నువ్వే కథానాయికుడివి. రోహిత్‌ శెట్టి కన్ను నీపై పడటం ఖాయం భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

అయితే, ధోని ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘ఏం మాట్లాడుతున్నారు.. హీరోలా ఉండటమేంటి.. నిజ జీవితంలో హీరో తను’’ అని అభిమానం చాటుకుంటున్నారు. కాగా ఈ ఫొటో ఓ టీవీ యాడ్‌కు సంబంధించినదిగా సమాచారం. ఎంఎస్‌ ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. 

సైనికుడిగానూ..
ఇక​ టీమిండియా తరఫున 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన జార్ఖండ్‌ డైనమైట్‌ ధోని 17 వేల పరుగులు సాధించాడు. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తలా.. సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కాగా క్రీడా రంగంలో.. ధోని సేవలను గుర్తించిన కేంద్రం అతడికి టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కల్పించింది.

సినీ రంగంలో..
ఇదిలా ఉంటే.. ధోని ఇటీవలే సినిమా రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌’అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు.  తమ బ్యానర్‌పై  నిర్మిస్తున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను ఇటీవలే విడుదల చేశారు. ‘ఎల్‌జీఎం’ (లెట్స్‌ గెట్స్‌ మ్యారీడ్‌) పేరిట కోలీవుడ్‌ సినిమా నిర్మించనున్నారు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న తలా ఇలా అక్కడి సినీ పరిశ్రమపై దృష్టి పెట్టడం గమనార్హం.

చదవండి: Joginder Sharma: రిటైర్మెంట్‌ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్‌ హీరో
Ind Vs Aus: నాలుగురన్నరేళ్ల పైనే అయింది.. టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్‌ పాండ్యా​ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు