అందుకే ఫైనల్‌ ఓవర్‌ను జడేజాకు ఇచ్చా: ధోని 

18 Oct, 2020 16:02 IST|Sakshi

షార్జా: చెన్నై సూపర్‌కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకూ వెళ్లిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఆ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ ముందు వరకూ సీఎస్‌కే చేతిలో ఉన్నప్పటికీ అక్షర్‌ పటేల్‌ మూడు సిక్స్‌లతో ఢిల్లీకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. శిఖర్‌ ధావన్‌ 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 101 పరుగులు సాధించి విజయానికి బాటలు వేయగా, అక్షర్‌ పటేల్‌ దానికి మంచి ఫినిషింగ్‌ ఇచ్చాడు. అయితే ఆఖరి ఓవర్‌ను రవీంద్ర జడేజా చేతికి ధోని ఇవ్వడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. (అతనికి చాన్స్‌ ఇస్తే కరోనా వ్యాక్సిన్‌ కూడా..: సెహ్వాగ్‌)

దీనిపై మ్యాచ్‌ తర్వాత అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ.. చివరి ఓవర్‌ను జడేజాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. ‘ ఆఖరి ఓవర్‌ను బ్రేవోకు ఇవ్వాలనుకున్నాం. కానీ బ్రేవో ఫిట్‌గా లేడు. అతని డగౌట్‌లోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నాకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జడ్డూ(జడేజా), రెండు కరణ్‌ శర్మ. దాంతో జడేజాకు ఇవ్వడానికి మొగ్గుచూపాను’ అని తెలిపాడు. ఇక శిఖర్‌ ధావన్‌ సెంచరీపై మాట్లాడుతూ.. ‘ మేము ఫీల్డింగ్‌లో చాలా తప్పిదాలు చేశాం. ధావన్‌ క్యాచ్‌లను పలుమార్లు జారవిడిచాం. అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశాన్ని కల్పించాం. దాంతో అతని స్టైక్‌రేట్‌ పెరుగుతూ పోయింది. ఇక సెకండ్‌ హాఫ్‌లో వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. అయినా మంచి ఇన్నింగ్స్‌ ఆడిన ధావన్‌కు కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాలి’ అని పేర్కొన్నాడు. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ 180 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంబటి రాయుడు(45 నాటౌట్‌; 1ఫోర్‌, 4 సిక్స్‌లు)  రవీంద్ర జడేజా(33 నాటౌట్‌; 13 బంతుల్లో 4 సిక్స్‌లు), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో డుప్లెసిస్‌లు  సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. ఆపై ఢిల్లీ టార్గెట్‌ ఛేదించే క్రమంలో  పృథ్వీ షా డకౌట్‌ అయ్యాడు. ఆపై అజింక్యా రహానే(8) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(23; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), స్టోయినిస్‌(24;14 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మోస్తరుగా ఆడగా, ధావన్‌ మాత్రం జట్టు విజయం సాధించే వరకూ క్రీజ్‌లో ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ధావన్‌ ఆటలో సిక్స్‌లు పెద్దగా లేకపోయినా బౌండరీలను గ్యాప్‌ల్లోంచి రాబట్టడం ద్వారా తనేమిటో నిరూపించుకున్నాడు.  ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సమయంలో ఆ బాధ్యతను అక్షర్‌ తీసుకున్నాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి ధావన్‌ సింగిల్‌ తీయగా,  అక్షర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు.  ఇక నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన అక్షర్‌.. ఐదో బంతికి మరో సిక్స్‌ కొట్టి ఢిల్లీని గెలిపించాడు.

మరిన్ని వార్తలు