సాక్షి ధోని, అనుష్క శర్మలు చిన్నతనంలో క్లాస్‌మేట్సట..

20 Apr, 2021 21:44 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనిల జీవిత భాగస్వాములు చిన్నతనంలో క్లాస్‌మేట్స్‌ అన్న విషయం ఇటీవలి కాలంలో అందరికి తెలిసిపోయింది. వీరిద్దరు చిన్నతనంలో అసోంలోని ఓ పాఠశాలలో చదువుకున్నట్లు 2012లో అనుష్క శర్మ వెల్లడించింది. ధోని భార్య సాక్షి, తను అసోంలోని ఓ చిన్న పట్టణంలో నివాసం ఉన్నట్లు, తామిద్దరం కలిసి ఒకే స్కూల్‌లో చదువుకున్నట్లు ఆమె ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో తెలిపింది. ఈ సందర్భంగా ఆమె, సాక్షి కలిసి స్కూల్‌లో  తీయించుకున్న ఫోటోను ఆమె బహిర్గతం చేసింది. ఈ ఫోటోలో సాక్షి ఏంజెల్‌ వేషంలో ఉండగా, అనుష్క తన ఫేవరెట్‌ హీరోయిన్‌ మాధురి దీక్షిత్‌ తరహాలో గాగ్రా చోలీ ధరించి కనిపించింది. ఈ ఫోటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి.

 

ఇదిలా ఉంటే, సాక్షి.. నాటి టీమిండియా టీ20 కెప్టెన్‌ ధోనిని 2010 జులై 4న వివాహం చేసుకోగా, కోహ్లి, అనుష్కల వివాహం 11 డిసెంబర్‌ 2017లో జరిగింది. అయితే వీరిద్దరి నిజ జీవితాల్లో చాలా కామన్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ చిన్ననాటి స్నేహితురాళ్లు.. భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్లను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక్కో కూతురు జన్మనిచ్చారు. ధోని దంపతులు తమ కుమార్తెకు జీవా అని నామకరణం చేయగా, విరుష్క జంట తమ గారాలపట్టికి వామిక అని పేరు పెట్టారు. ప్రస్తుతం ధోని, కోహ్లిలిద్దరూ ఐపీఎల్ 2021 సీజన్‌లో బిజీగా ఉండగా.. సాక్షి, అనుష్క శర్మలు ఎప్పటికప్పుడూ తమ అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఈ త్రో బ్యాక్ ఫోటోలను అనుష్క శర్మ ఫ్యాన్స్ క్లబ్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
చదవండి: అందమైన రాజస్థానీ రాయల్‌కు జన్మదిన శుభాకాంక్షలు..

మరిన్ని వార్తలు