ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను..

20 May, 2021 21:16 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని భారత మహిళా జట్టు వికెట్‌ కీపర్‌ ఇంద్రాణి రాయ్‌ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో సభ్యురాలైన ఈ పశ్చిమ్‌ బెంగాల్‌ మహిళా క్రికెటర్‌.. ధోనిని ఆదర్శంగా తీసుకుని, అతని అడుగుజాడల్లో నడుస్తానంటోంది. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుండగా ఇంద్రాణి.. మూడు ఫార్మాట్లలో జట్టు సభ్యురాలిగా ఉంది. 

టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కల అని, ఇంగ్లండ్ పర్యటనతో అది నిజం కాబోతుందని ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకోవడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది. అండర్‌-19, అండర్‌-23 బెంగాల్‌కు ఆడిన ఆమె.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో 2018లో ఝార్ఖండ్‌కు మారింది. రాంచీలో జరిగే ట్రైనింగ్‌ సెషెన్స్‌లో ఆమె ధోనిని చాలాసార్లు కలిసింది. వికెట్‌ కీపింగ్‌పై ఆమెకు మక్కువను చూసిన మహేంద్రుడు ఆమెకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. ఆ సలహాల వల్లే తాను జాతీయ జట్టుకు ఎంపిక కాగలిగానని ఆమె పేర్కన్నారు.
 

మరిన్ని వార్తలు