సిక్కి రెడ్డి–ధ్రువ్‌ జంట సంచలనం

18 Nov, 2021 04:45 IST|Sakshi

ప్రపంచ ఐదో ర్యాంక్‌ జోడీపై గెలుపు

కశ్యప్, సాయిప్రణీత్‌ ఇంటిముఖం

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, ప్రణయ్‌ 

బాలి: ఇండోనేసియా మాస్టర్స్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సిక్కి రెడ్డి–ధ్రువ్‌ కపిల (భారత్‌) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 178వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి రెడ్డి–ధ్రువ్‌ ద్వయం 21–11, 22–20తో ప్రపంచ 5వ ర్యాంక్, రెండో సీడ్‌ ప్రవీణ్‌ జోర్డాన్‌–మెలాతి దెవా ఒక్తావియాంతి (ఇండోనేసియా) జంటను బోల్తా కొట్టించింది. కేవలం 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సిక్కి–ధ్రువ్‌ జోడీ 15–19తో వెనుకబడింది.

అయితే ఒక్కసారిగా చెలరేగిన సిక్కి–ధ్రువ్‌ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక పాయింట్‌ కోల్పోయినా... వెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సుమిత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) 15–21, 16–21తో హఫీజ్‌ ఫైజల్‌–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్‌ గౌరవ్‌ ప్రసాద్‌–జూహీ దేవాంగన్‌ (భారత్‌) 15–21, 12–21తో చాంగ్‌ తక్‌ చింగ్‌–ఎన్జీ వింగ్‌ యుంగ్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయారు. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–18, 15–21, 21–16తో క్రిస్టోవ్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌)పై... హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 22–20, 21–19తో డారెన్‌ లియు (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ పారుపల్లి కశ్యప్‌ 10–21, 19–21తో హాన్స్‌ క్రిస్టియన్‌ విటింగస్‌ (డెన్మార్క్‌) చేతిలో... ప్రపంచ 16వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 21–16, 14–21, 20–22తో హిరెన్‌ రుస్తావితో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. 

మరిన్ని వార్తలు