Aus Vs SL: మీ నాన్న నీకు నేర్పించలేదా?: ఆసీస్‌ క్రికెటర్‌ను ట్రోల్‌ చేసిన గావస్కర్‌.. స్పందన ఇదే

17 Oct, 2023 16:04 IST|Sakshi

ICC WC 2023- Aus Vs SL: వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంకపై విజయంతో హ్యాట్రిక్‌ ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది ఆస్ట్రేలియా. లక్నోలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి.. తాజా ఎడిషన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.

కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక ఆరంభంలో అదరగొట్టినా.. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో 209 పరుగులకే పరిమితమైంది. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడం జంపా(4 వికెట్లు) దాటికి లంక బ్యాటర్లు విలవిల్లాడిపోయారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో
ఇలా క్రీజులోకి వచ్చి.. అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ 51 బంతుల్లో 52 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ లబుషేన్‌ 40 పరుగులు చేశాడు.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ అర్ధ శతకం(58) సాధించగా.. గ్లెన్‌ మాక్స్‌వెల్‌(31- నాటౌట్‌), మార్కస్‌ స్టొయినిస్‌(20-నాటౌట్‌) విజయలాంఛనం పూర్తి చేశారు. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూ తొలి విజయం అందుకోగా.. ఆడం జంపాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

మీ నాన్న నీకు నేర్పించలేదా?
అయితే, ఈ గెలుపుతో జంపాతో పాటు మార్ష్‌ది కూడా కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మార్ష్‌ను టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఫన్నీగా ట్రోల్‌ చేశాడు.

‘‘మీ నాన్న నీకెప్పుడూ ఇలా ఆడాలని నేర్పించలేదా’’ అంటూ డిఫెన్సివ్‌ షాట్‌ ఆడుతున్నట్లుగా ఫోజు పెట్టాడు. ఇందుకు స్పందించిన మార్ష్‌.. ‘‘మా నాన్న పూర్‌ స్ట్రైక్‌రేటును కప్పిపుచ్చేలా ఇలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా’’ అని అంతే సరదాగా బదులిచ్చాడు.

జెఫ్‌ మార్ష్‌ తనయుడే మిచెల్‌
కాగా మిచెల్‌ మార్ష్‌ మరెవరో కాదు.. ఆసీస్‌ మాజీ బ్యాటర్‌ జెఫ్‌ మార్ష్‌ కుమారుడు. గావస్కర్‌కు సమకాలీనుడైన జెఫ్‌ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 117 మ్యాచ్‌లాడి.. 55.93 స్ట్రైక్‌రేటుతో 4357 పరుగులు సాధించాడు. 

ఇందులో 9 సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఇప్పటి వరకు 82 వన్డేల్లో 93.85 స్ట్రైక్‌రేటుతో 2290 రన్స్‌ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

తండ్రి అలా.. కొడుకు ఇలా
ఈ నేపథ్యంలో తండ్రీతనయులు స్ట్రైక్‌రేటును ఉద్దేశించి గావస్కర్‌ సరదాగా కామెంట్‌ చేయగా.. మార్ష్‌ బదులిచ్చిన తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. ఇక లంకపై విజయం గురించి మార్ష్‌ మాట్లాడుతూ.. ఇంగ్లిస్‌ ఓ యోధుడని.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్నవాడని ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు మరింత గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాలని ఆకాంక్షించాడు.
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు