మారడోనా మృతి.. డాక్టర్‌పై విచారణ!

30 Nov, 2020 09:23 IST|Sakshi

బ్యూనస్‌ ఎయిర్‌(అర్జెంటీనా): ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా (60) మృతి నేపథ్యంలో ఆయన వ్యక్తిగత వైద్యుడు లియోపోల్డో ల్యూక్‌పై విచారణ చేపట్టారు. చికిత్స అందించడంలో ల్యూక్‌ నిర్లక్ష్యమే మారడోనా మరణానికి దారి తీసిందన్న సందేహాలు తలెత్తున్న క్రమంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచిన మారడోనా బుధవారం కన్నుమూసిన విషయం విదితమే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అప్పటి నుంచి టిగ్రీలోని నివాసంలో ఆయనకు చికిత్స అందిస్తుండగా, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. (చదవండి: వేలానికి మారడోనా ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ జెర్సీ)

ఈ నేపథ్యంలో తమ తండ్రి ఆకస్మిక మరణం పట్ల మారడోనా కుమార్తెలు దల్మా, గియానినా, జనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన గుండె పనితీరును దృష్టిలో పెట్టుకుని, సరైన విధంగా చికిత్స అందించనందు వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారని పోలీసు వర్గాల సమాచారం. ‘‘దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులతో పాటు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడుతున్నాం. అయితే ఇందుకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ మారడోనా తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణ ధ్రువీకరణ పత్రంపై ఎవరి సంతకం లేదు. అలా అని దీనిని అనుమానాస్పద మృతిగా భావించలేము. విచారణ చేపట్టడం మా బాధ్యత’’ అని అధికారులు పేర్కొన్నారు.(చదవండి: గుడ్‌బై మారడోనా)

కాగా ఈ విషయంపై స్పందించేందుకు ల్యూక్‌ నిరాకరించారు. ఇక మారడోనా పరిస్థితి విషమించిన తరుణంలో అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా, సుమారు గంటన్నర తర్వాత అక్కడికి చేరుకుందని, అత్యవసర పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక కారణాలేమిటో కనిపెట్టాలని మారడోనా న్యాయవాది మైటాస్‌ మోర్లా డిమాండ్‌ చేశారు. అదే విధంగా మారడోనా మెడికల్‌ రికార్డ్స్‌, ఆయన ఇంటి సమీపంలో గల సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, ఆ టాక్సికోలాజికల్‌ నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసును ముందుకు తీసుకువెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు