వేలానికి మారడోనా ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ జెర్సీ

29 Nov, 2020 06:26 IST|Sakshi

లండన్‌: దివంగత అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా కెరీర్‌లో ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ ఎంత ప్రసిద్ధికెక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా మారడోనా చేసిన ఈ గోల్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ గోల్‌ మాత్రమే కాకుండా ఆ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ, షూ పట్ల అందరికీ ప్రత్యేక ఆసక్తి. ఇప్పుడు ఆ జెర్సీ వేలానికి రానుంది.

ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌ స్టీవ్‌ హోడ్జ్‌ దగ్గరున్న జెర్సీని వేలంలో 20 లక్షల డాలర్లకు (రూ. 14.79 కోట్లు) విక్రయించనున్నట్లు అమెరికా క్రీడా వస్తువుల సేకరణ నిపుణుడు డేవిడ్‌ అమర్మన్‌ తెలిపాడు. ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ జెర్సీకి విలువ కట్టడం చాలా కష్టం. కానీ దాని యజమాని వేలంలో 20 లక్షల డాలర్లు ఆశిస్తున్నారు. ధర ఎక్కువే. కానీ అధిక సంపద ఉన్న వ్యక్తి ఆ జెర్సీని ఎందుకు వద్దనుకుంటారు. ఇది అమ్ముడయ్యే అవకాశం ఉంది’ అని డేవిడ్‌ అన్నారు. మారడోనా మరణానంతరం ఈ జెర్సీని ప్రస్తుతం మాంచెస్టర్‌లోని ఇంగ్లండ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు.

మరిన్ని వార్తలు