మారడోనా జెర్సీ ధర ఎంతో తెలుసా..

28 Nov, 2020 12:30 IST|Sakshi

లండన్‌ : అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం.. సాకర్‌ స్టార్‌ ప్లేయర్‌ డీగో మారడోనా ఈ బుధవారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా దేశం మాత్రమే గాక యావత్‌ ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానులు మారడోనా లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. మారడోనాను కడసారి చూసుకోవాలని ఫుట్‌బాల్‌ అభిమానులు తరలివచ్చారు.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అభిమాన ఆటగాడు దూరమయ్యాడని బాధపడుతున్న అభిమానులకు మారడోనా జెర్సీని దక్కించుకునే అవకాశం కలిగింది‌. 1986 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ వేలం వేయనున్నారు. 

అసలు విషయంలోకి వెళితే.. 1986 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా చేసిన ఒక గోల్‌ వివాదాస్పదంగా మారింది. చేత్తో ఫుట్‌బాల్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపించినట్లు అప్పటి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ రిఫరీ వద్ద ఆరోపించారు. కానీ రిఫరీ ఎలాంటి చర్య తీసుకోలేదు.  మ్యాచ్‌ ముగిసిన తర్వాత మారడోనా చేసిన ఆ గోల్‌ను 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్'(దేవుడిచ్చిన చేయి)‌గా అభివర్ణించారు. ఆ తర్వాత తాను చేత్తోనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపినట్లు మారడోనా ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ మాంచెస్టర్‌లోని ఇంగ్లండ్‌ నేషనల్‌ ఫుట్‌బాల్‌ మ్యూజియంలో ఉంచారు. వాస్తవానికి మ్యాచ్‌ ముగిసిన తర్వాత  మారడోనా, ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ స్టీవ్‌ హడ్జ్‌ సరదాగా తమ జెర్సీలను మార్చుకున్నారు. అప్పటినుంచి మారడోనా జెర్సీ హడ్జ్‌ వద్దే ఉండిపోయింది. (చదవండి : గుడ్‌బై మారడోనా)


తాజాగా మారడోనా అస్తమయం తర్వాత అతను ధరించిన జెర్సీని వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం  2 మిలియన్‌ డాలర్లగా కనీస ధరగా నిర్ణయించింది. అయితే మారడోనా జెర్సీని వేలం వేయడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుట్‌బాల్‌ చరిత్రలో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన ఒక దిగ్గజానికి ఇలాగేనా గౌరవం ఇచ్చేది అంటూ మండిపడుతున్నారు. ఒకవేళ జెర్సీ వేలంలోకి వచ్చినా ఇంకా ఎక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. అయినా ఫుట్‌బాల్‌కు మారడోనా చేసిన సేవలు వెలకట్టలేనిదంటూ అభిమానులు పేర్కొన్నారు. (చదవండి : మరో ప్రపంచానికి మారడోనా)

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ఎన్నో అరుదైన, లెక్కలేనన్ని ఘనతలు సొంతం చేసుకున్న డీగో... నాలుగు ప్రపంచకప్‌లు ఆడి 1986లో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 1990లో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్‌ డివిజన్‌ క్లబ్‌ జిమ్నాసియా (సీజీఈ)కి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌ చివర్లో వచ్చిన వివాదాలతో అప్పటి వరకు సాధించిన ఘనతలపై నీలి నీడలు కమ్ముకున్నా... మైదానంలో అతని మంత్రముగ్ధమైన ఆటను చూసినవారెవరూ మారడోనాను మరచిపోలేరు. ‘గోల్డెన్‌ బాయ్‌’గా మారడోనా సాధించిన ఖ్యాతి అజరామరం. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా