FIFA World Cup 2022: మారడోనా 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'కు మరో అరుదైన గౌరవం

1 Oct, 2022 18:30 IST|Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ జెర్సీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఖతార్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక​ ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా జెర్సీని ప్రత్యేక డిస్‌ప్లేలో ఉంచనున్నారు. అక్టోబర్‌ 2(ఆదివారం) నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఖతార్‌లోని స్పోర్ట్స్‌ మ్యూజియంలో ఉంటుందని ఒక అధికారి పేర్కొన్నారు.

ఇక నాలుగు నెలల క్రితమే మారడోనా హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌  జెర్సీని వేలం వేయగా కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. కాగా జెర్సీని కొన్న ఆ వ్యక్తి పేరును ఇప్పటివరకు బయటపెట్టలేదు. మారడోనాకు వీరాభిమాని అయిన ఆ అజ్ఞాతవ్యక్తి జెర్సీని 71లక్షల పౌండ్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ.67 కోట్ల 72 లక్షలకు) కొనుగోలు చేయడం విశేషం.

1986 సాకర్‌ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా ఈ జెర్సీనే ధరించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్‌ చేయగా.. అందులో ఒకటి హ్యాండ్‌ ఆఫ్‌ గోల్‌ కూడా ఉంది. ఈ గోల్‌ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్‌ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్టీవ్‌ హాడ్జ్‌కు అందజేశాడు.దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్‌ ఏప్రిల్‌ నెలలో ‘సోతీబై’ అనే ఆన్‌లైన్‌ వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టాడు.

మరిన్ని వార్తలు