Maradona 'Hand Of GOD' Ball: మారడోనా 'ఫుట్‌బాల్‌'కు కళ్లు చెదిరే మొత్తం.. ఎందుకంత క్రేజ్‌

17 Nov, 2022 18:30 IST|Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ''హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'' గోల్‌. ఆనాడు మారడోనా Hand OF God Goal కొట్టిన బంతికి తాజాగా వేలంలో కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయింది. బుధవారం లండన్‌లో నిర్వహించిన వేలంలో ఆ బంతి అక్షరాల .19.5 కోట్ల ధరకు అమ్ముడైంది. అయితే ఇంతకాలం ఆ బంతి అప్పటి మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అలీ బిన్‌ నాసర్‌(ట్యునీషియా) దగ్గరే ఉంది. తాజాగా వేలానికి పెట్టడంతో ఇలా భారీ ధరకు అమ్ముడుపోయింది. 

1986 సాకర్‌ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్‌ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్‌.. ''హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌''(Hand OF GOD) గోల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్‌ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా ధరించిన జెర్సీకి కూడా కళ్లు చేదిరే మొత్తం వచ్చి చేరింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్‌ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్టీవ్‌ హాడ్జ్‌కు అందజేశాడు. దానిని దాచుకున్న హాడ్జ్‌ ఏప్రిల్‌ నెలలో ‘సోతీబై’ అనే ఆన్‌లైన్‌ వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టగా ఒక అజ్ఞాతవ్యక్తి సదరు జెర్సీని 71 లక్షల పౌండ్లకు అమ్ముడుపోవడం విశేషం.

చదవండి: మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన జైశ్వాల్‌ వీరొచిత సెంచరీ 

FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే

మరిన్ని వార్తలు