PM Modi Maldives Controversy: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు: మాల్దీవులకు వెళ్లొద్దంటున్న క్రికెటర్లు!

8 Jan, 2024 12:12 IST|Sakshi
భారత్‌లోని అందమైన ప్రదేశాలు (PC: X)

Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు.

భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు.

మోదీ ఫొటోలు వైరల్‌.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు
కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్‌ చేశారు.

ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్‌లో బీచ్‌లు, హోటల్‌ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌, #ExploreIndianIslands ట్రెండ్‌ చేస్తున్నారు భారత నెటిజన్లు.

మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి
ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఆకాశ్‌ చోప్రా, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్‌.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్‌ బీచ్‌, అండమాన్‌లోని నీల్‌, హవెలాక్‌తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్‌లు కూడా చాలా ఉన్నాయి. 

మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి..  ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు.

ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్‌ హోటల్స్‌లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. 

మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. 

మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా?
అదే విధంగా ఆకాశ్‌ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్‌’’ అని పేర్కొన్నాడు.

కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. 

>
మరిన్ని వార్తలు