2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్‌ అమ్ముతూ

23 Jun, 2021 12:44 IST|Sakshi
ఎయిర్‌ పిస్టల్‌ షూటర్‌ దిల్‌రాజ్‌ కౌర్‌ (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)

కటిక పేదరికం అనుభవిస్తున్న పారా షూటర్‌ దిల్‌రాజ్‌ కౌర్‌

డెహ్రడూన్‌: ఆమె ఒకప్పుడు అంతర్జాతీయ వేదికల మీద మన దేశ జాతీయ పతకాన్ని రెపరెపలాడించారు. భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. దేశానికి అవసరమైనప్పుడు ఆమె నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి.. దేశ కీర్తిని పెంచారు. కానీ ఇప్పుడు ఆమె కటిక పేదరికం అనుభవిస్తూ.. సాయం కోసం ఎదురు చూస్తుంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి కష్ట కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన ఓ చిన్న బండి మీద చిప్స్‌, బిస్కట్‌ ప్యాకెట్‌లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు దిల్‌రాజ్‌ కౌర్‌. ఆ వివరాలు.. 

ఉ‍త్తరాఖండ్‌కు చెందిన దిల్‌రాజ్‌ కౌర్‌ భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ఈ రంగంలో ప్రవేశించిన ఆమె 2015 వరకు విజయవంతంగా కొనసాగారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు డజన్లకు పైగా పతకాలు గెలుచుకున్నారు. అయితే ఆ పతకాలు ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ.. ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన బండి పెట్టుకుని చిప్స్‌, బిస్కెట్‌ ప్యాకెట్స్‌ అమ్ముతున్నారు. ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారా ఎయిర్‌ పిస్టల్‌ షూటర్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు ఒక్క చిప్స్‌ ప్యాకెట్‌ ధర కేవలం పది రూపాయలు మాత్రమే అంటూ ఇలా రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దిల్‌రాజ్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ‘‘దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చాను.. ఎన్నో పతకాలు సాధించాను. కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఉత్తరఖండ్‌ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం, మద్దతు లభించలేదు. నా విజయాల ఆధారంగా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగానికి అప్లై చేశాను. కానీ ప్రతిసారి తిరస్కరించారు. ప్రస్తుతం నేను మా అమ్మతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటున్నాను. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అద్దె కట్టడం, మిగతా ఖర్చుల కోసం ఇలా రోడ్డు పక్కన చిప్స్‌, బిస్కెట్లు అమ్ముతున్నాను’’ అని తెలిపారు. 

చదవండి: కరోనాతో ‘షూటర్‌ దాదీ’ మృతి.. మిమ్మల్ని మిస్సవుతున్నాం

మరిన్ని వార్తలు