Asia Cup2022: ఇదేమి బౌలింగ్‌రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు!

12 Sep, 2022 09:28 IST|Sakshi

ఆసియాకప్‌-2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఛాంపియన్‌గా శ్రీలంక అవతరిచింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 147 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌(55) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.

లంక బౌలర్లలో ప్రమోద్ మదుషన్ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బ తీయగా.. హాసరంగా మూడు, కరుణరత్నే రెండు వికెట్లు సాధించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడితో పాటు వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో హారిస్‌ రౌఫ్‌ 3, నసీమ్‌ షా, షాదాబ్‌ ఖాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

తొలి బంతికే పది పరుగులు 
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్‌ బౌలింగ్‌ వేసిన శ్రీలంక పేసర్‌ మధు శంక మొదటి బంతికే ఏకంగా 10 పరుగులు ఇచ్చాడు. తొలి బంతినే నోబాల్‌గా మధుశంక వేశాడు. అనంతరం పాక్‌ బ్యాటర్లకు ఫ్రీహిట్‌ లభించింది. అయితే వరుసగా నాలుగు బంతులను కూడా వైడ్‌గానే అతడు వేశాడు.

అందులో ఓ బంతి వైడ్‌తో పాటు బౌండరీకి కూడా వెళ్లింది. దీంతో తొలి ఐదు బంతులు లెక్కలోకి రాకుండానే ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ​పాకిస్తాన్‌కు 9 పరుగులు వచ్చాయి. ఎట్టకేలకు ఆరో బంతిని మధుశంక సరిగ్గా వేశాడు. ఈ ఫ్రీహిట్‌ బంతికి సింగిల్‌ మాత్రమే పాక్‌బ్యాటర్‌ రిజ్వాన్‌ సాధించాడు. దీంతో తొలి బంతి పడేటప్పటికి పాక్ ఖాతాలో 10 పరుగులు వచ్చి చేరాయి. మధుశంక బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


చదవండి: Asia Cup 2022 Final: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్‌

మరిన్ని వార్తలు