Rohit Sharma: రోహిత్‌ శర్మ నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు.. అందుకే అలా: దినేశ్‌ కార్తిక్‌

19 Aug, 2022 14:26 IST|Sakshi

ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఎత్తుపళ్లాలు సహజం. కొన్నిసార్లు అద్బుత విజయాలతో ప్రశంసలు అందుకుంటే.. మరికొన్ని సార్లు అంచనాల అందుకోలేక విమర్శలపాలవుతారు. ఇక క్రికెటర్ల విషయానికొస్తే.. ఎంతటి మేటి ఆటగాడు అయినా ఒక్కసారి ఫామ్‌ కోల్పోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విషయంలో ప్రస్తుతం వినిపిస్తున్న కామెంట్లే ఇందుకు తాజా నిదర్శనం.

ఇక కెరీర్‌ తొలినాళ్లలో ఏ చిన్న తప్పు చేసినా జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ చాలు రాత మారటానికి! భారత జట్టు ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒకప్పుడు ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్లో‌ అవకాశాలు బాగానే ఉన్నా.. టెస్టు జట్టులో చోటు కోసం మాత్రం ఈ హిట్‌మ్యాన్‌ పరితపించిపోయేవాడు. ఐర్లాండ్‌తో వన్డే మ్యాచ్‌లో 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు రోహిత్‌. అదే ఏడాది టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత!
అయితే, ఆరేళ్ల నిరీక్షణ తర్వాతే.. క్రికెటర్‌గా అసలైన గుర్తింపునిచ్చే టెస్టుల్లో రోహిత్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా స్వదేశంలో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న హిట్‌మ్యాన్‌.. అరంగేట్రంలోనే అద్భుత శతకం బాదాడు. 

శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌, ఛతేశ్వర్‌ పుజారా, సచిన్‌ టెండుల్కర్‌, విరాట్‌ కోహ్లి తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఓపికగా క్రీజులో నిలబడి 301 బంతులు ఎదుర్కొని 23 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 177 పరుగులు సాధించాడు. తద్వారా జట్టును ఇన్నింగ్స్‌ మీద 51 పరుగుల తేడాతో గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఆడిన రెండో టెస్టులోనూ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇబ్బందులు ఎదురైనా!
కానీ ఆ తర్వాత నాలుగేళ్ల పాటు రోహిత్‌ ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. ఈ క్రమంలో 2017లో మూడో సెంచరీ సాధించాడు. అయితే, మళ్లీ నాలుగో సెంచరీ చేయడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఈ క్రమంలో విమర్శలపాలయ్యాడు. అయితే, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పూర్తి ఫామ్‌లోకి వచ్చిన రోహిత్‌ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మిడిలార్డర్‌ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొంది.. ఇప్పుడు కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు.

నాతో చెప్పుకొన్నాడు!
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో చోటు కోసం రోహిత్‌ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి క్రిక్‌బజ్‌ షోలో తాజాగా ప్రస్తావించాడు. ఈ మేరకు డీకే మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు అతడి పైకి విమర్శల బంతులు దూసుకువచ్చాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగాడు.

మరికొన్నింటికి జవాబులు కనుక్కోలేకపోయాడు. నిజానికి.. టెస్టు క్రికెట్‌లో తనను తాను నిరూపించుకోవాలని రోహిత్‌ భావించేవాడు. అయితే, అన్నిసార్లూ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు కదా! అతడు ఇబ్బందుల పాలయ్యాడు. నాతో జరిగిన చర్చల్లో ఆ విషయాల గురించి పంచుకునేవాడు. 

నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు
నిజం చెప్పాలంటే.. ఒక్కోసారి తను నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు. అయితే ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అనూహ్యరీతిలో తిరిగి వచ్చి అద్బుత ఆటతీరుతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. టెస్టుల్లో ఘనమైన అరంగేట్రం చేసిన అతడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చినా తనను తాను నిరూపించుకున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్‌ ఇప్పటి వరకు 45 టెస్టులాడి 3137 పరుగులు చేశాడు.

ఇందులో ఎనిమిది సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 212.  ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌-2022 టోర్నీకి డీకే ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2022 తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన అతడు.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వల్లే తాను ప్రస్తుతం ఇలా ఉన్నానంటూ గతంలో వ్యాఖ్యానించాడు.

చదవండి: Deepak Chahar: చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు!
Stuart Broad: ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన ఫీట్‌.. టెస్టు క్రికెట్‌లో నాలుగో బౌలర్‌గా

మరిన్ని వార్తలు