Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి

18 Jun, 2022 08:14 IST|Sakshi

స్వీట్‌ సిక్స్‌టీన్‌ ఇయర్స్‌ కెరీర్‌... 2006లో భారత్‌ తరఫున ఆడిన తొలి టి20 నుంచి 2022లో ఆడిన ప్రస్తుత మ్యాచ్‌ వరకు తన బ్యాటింగ్‌లో పదును తగ్గలేదని దినేశ్‌ కార్తీక్‌ నిరూపించాడు. ఐపీఎల్‌ ఫామ్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కార్తీక్‌ కొనసాగించగలడా అనే సందేహాలకు మెరుపు బ్యాటింగ్‌తో అతను సమాధానమిచ్చాడు. చూడచక్కటి షాట్లు ప్రదర్శించి 37 ఏళ్ల వయసులో సెలక్టర్లకు ప్రపంచకప్‌లో స్థానం కోసం సవాల్‌ విసిరాడు.

16 ఏళ్ల కెరీర్‌లో దినేశ్‌ కార్తిక్‌.. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20లో మెయిడెన్‌ అర్థ సెంచరీ సాధించాడు. 27 బంతుల్లో  అర్థసెంచరీ మార్క్‌ అందుకున్న కార్తిక్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో దూకుడుగా ఆడి అర్థ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే దినేశ్‌ కార్తిక్‌ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరపున టి20లో అర్థసెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా దినేశ్‌ కార్తిక్‌ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కార్తిక్‌ వయసు 37 ఏళ్ల 16 రోజులు.


2018లో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన టి20 మ్యాచ్‌లో ధోని 36 ఏళ్ల 229 రోజుల వయసులో తన కెరీర్‌లో రెండో అర్థసెంచరీ అందుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా నుంచి ధోనినే పెద్ద వయస్కుడిగా ఉన్నాడు. తాజాగా కార్తిక్‌ ధోనిని అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఇక శిఖర్‌ ధావన్‌ 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 35 ఏళ్ల ఒక రోజు వయసులో అర్థసెంచరీ అందుకొని కార్తిక్‌, ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు.

తన కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న కార్తిక్‌ ఇలాగే ఆడితే టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక మ్యాచ్‌ ఫినిషర్‌గా మారే అవకాశముంది. కార్తిక్‌ ఇన్నింగ్స్‌ చూసిన అభిమానులు కామెంట్స్‌తో రెచ్చిపోయారు. 37 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు.. డీకేతోని అట్లుంటది మరి.. ధోనికి సరైన వారసుడు దొరికాడు.. టీమిండియాకు మరో బెస్ట్‌ ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

చదవండి: కార్తీక్‌, ఆవేశ్‌ఖాన్‌ల జోరు.. నాలుగో టి20లో టీమిండియా ఘన విజయం

మరిన్ని వార్తలు