నేనిక్కడే ఉన్నా, వచ్చేయమంటారా.. టీమిండియాకు డీకే బంపర్‌ ఆఫర్‌

16 Jul, 2021 16:00 IST|Sakshi

లండన్‌: టీమిండియా వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహాలు కరోనా కారణంగా ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 20 నుంచి కౌంటీ ఛాంపియన్షిప్‌ జట్టుతో ప్రారంభం కాబోయే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఇంగ్లండ్‌లోనే ఉన్నాను, వచ్చేయమంటారా అంటూ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీమిండియాకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తిన డీకే.. క్రికెట్‌కు వీడ్కోలు పలుకకుండానే కామెంటేటర్‌గా మారిపోయాడు. స్కైస్పోర్ట్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, టీమిండియాలోని ఇద్దరు స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్లు కరోనా కారణంగా ఐసోలేషన్‌కు పరిమితం కావడంతో జట్టులో వికెట్ కీపింగ్‌ అనుభవమున్న కేఎల్ రాహుల్‌వైపు అందరూ చూస్తున్నారు. అయితే రాహుల్‌కు గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కీపింగ్‌ చేసిన అనుభవం ఉంది. అందులోనూ రెగ్యులర్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరం కావడంతో ఓపెనింగ్‌ బాధ్యతలు రాహుల్‌పైనే పడే ఆస్కారం ఉంది. దీంతో టీమిండియా యాజమాన్యం అతనిపై అధిక భారం వేసేంత సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇలాంటి సమయంలో దినేశ్ కార్తీక్ చేసిన ట్వీట్ టీమిండియా పాలిట బంపర్‌ ఆఫర్‌గా మారింది. అయితే, డీకే.. క్రికెట్‌ కిట్‌తో పెట్టిన ట్వీట్‌లో 'జస్ట్ సేయింగ్' అన్న క్యాప్షన్‌ జోడించడం విశేషం.

మరిన్ని వార్తలు