ఈ సారథ్యం నాకొద్దు

17 Oct, 2020 05:40 IST|Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్సీకి దినేశ్‌ కార్తీక్‌ బైబై

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఇయాన్‌ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ (డీకే) ఐపీఎల్‌–13 సీజన్‌ మధ్యలో అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే అతనీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2018 నుంచి కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్‌ కెప్టెన్సీకి బైబై చెబుతూనే నూతన సారథిగా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ను నియమించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరాడు. అతను కోరినట్లే కోల్‌కతా ఫ్రాంచైజీ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్‌ సారథ్యంలోనే ఇంగ్లండ్‌ విశ్వవిజేత అయ్యింది.

‘బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు... జట్టుకు మరెంతో చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కార్తీక్‌ చెప్పినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతని నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని, అయినాసరే తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని టీమ్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ తెలి పారు. ‘జట్టు గురించే ఆలోచించే కార్తీక్‌లాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. ఈ సీజన్‌లో కార్తీక్, మోర్గాన్‌ కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే మోర్గాన్‌ సారథిగానూ విజయవంతం కావాలి. ఈ తాజా మార్పువల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆశిస్తున్నాం. రెండేళ్లుగా జట్టును నడిపించిన కార్తీక్‌కు అభినందనలు’ అని ఆయన తెలిపారు.

ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఓ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడు కావడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఇంగ్లండ్‌కే చెందిన కెవిన్‌ పీటర్సన్‌ 17 మ్యాచ్‌ల్లో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2009లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఆరు మ్యాచ్‌ల్లో... 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు 11 మ్యాచ్‌ల్లో పీటర్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మరిన్ని వార్తలు