డిస్నీ–స్టార్‌ సంచలన నిర్ణయం.. ఐసీసీ టోర్నీల టీవీ హక్కులను..

31 Aug, 2022 05:36 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్‌లకు సంబంధించి భారత్‌లో టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కులను మూడు రోజుల క్రితం సుమారు రూ. 24 వేల కోట్లకు డిస్నీ–స్టార్‌ సొంతం చేసుకుంది. అయితే మంగళవారం ఆ సంస్థ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ మ్యాచ్‌ ప్రసారాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తాము గెలుచుకున్న హక్కుల నుంచి టీవీ హక్కులు ‘జీ’ సంస్థకు (సబ్‌ లీజ్‌) బదలాయించింది. దీని ప్రకారం 2024–27 మధ్య కాలంలో ఐసీసీ పురుషుల క్రికెట్‌ టోర్నీలు, అండర్‌–19 టోర్నీలు ‘జీ’ చానల్స్‌లో ప్రసారం అవుతాయి. ఇదే కాలానికి డిజిటల్‌ హక్కులను మాత్రం స్టార్‌ తమ వద్దే అట్టి పెట్టుకుంది.

మరోవైపు మహిళల వరల్డ్‌ కప్‌ హక్కులను (టీవీ, డిజిటల్‌) కూడా పూర్తిగా స్టార్‌ ఉంచుకుంది. వేలంలో తమతో పోటీ పడి ఓడిన ‘జీ’తో స్టార్‌ ఒప్పందం చేసుకోవడం విశేషం. భారత్‌లో టీవీ ప్రసారాల ద్వారా క్రికెట్‌ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇది తమకు లభించిన గొప్ప అవకాశమని ‘జీ’ సంస్థ సీఈఓ పునీత్‌ వ్యాఖ్యానించారు. ఒకే మార్కెట్‌ను ఇద్దరు పోటీదారులు పంచుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌లో మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీ వేలం నిబంధనల్లో విజేత తమ హక్కులను మరొకరికి ఇచ్చుకోవచ్చనే క్లాజ్‌ కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే వేలం ఖాయం కావడానికి ముందే స్టార్‌–జీ మధ్య ఒప్పందం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు