జొకోవిచ్‌కు అనుకూలం

26 Jun, 2021 06:27 IST|Sakshi

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’ విడుదల 

మరో పార్శ్వంలో ఫెడరర్‌

వైదొలిగిన సిమోనా హలెప్‌

లండన్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గి జోరు మీదున్న వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి మెయిన్‌ ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. 2019 చాంపియన్, టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తొలి రౌండ్‌లో బ్రిటన్‌కు చెందిన టీనేజర్‌ జాక్‌ డ్రేపర్‌తో తలపడతాడు. తొలి రౌండ్‌ దాటితే రెండో రౌండ్‌లో జొకోవిచ్‌కు 2018 రన్నరప్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే అవకాశముంది. అంతా సవ్యంగా సాగిపోతే క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా), సెమీఫైనల్లో మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో జొకోవిచ్‌ ఆడాల్సి రావొచ్చు.

టాప్‌–10 సీడింగ్స్‌లో ఉన్నప్పటికీ రుబ్లెవ్, సిట్సిపాస్‌ గ్రాస్‌ కోర్టు స్పెషలిస్ట్‌లు కాకపోవడం జొకోవిచ్‌కు అనుకూలాంశం. ఎనిమిది సార్లు వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ ఆరో సీడ్‌గా ఈ టోర్నీలో ఆడనున్నాడు. వాస్తవానికి ఫెడరర్‌కు ఏడో సీడింగ్‌ కేటాయించినా ... నాలుగో సీడ్‌గా ఉన్న డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) టోర్నీ నుంచి వైదొలగడంతో సీడింగ్స్‌లో మార్పులు జరిగాయి. దాంతో ఫెడరర్‌ కు ‘డ్రా’లోని కింది పార్శ్వంలో చోటు లభించింది. తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌ ప్లేయర్‌ మనారినోతో ఫెడరర్‌ ఆడతాడు. వింబుల్డన్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న ఫెడరర్‌ స్థాయికి తగ్గట్టు ఆడితే మరో సారి ఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. కరోనా కారణంగా గత ఏడాది వింబుల్డన్‌ టోర్నీని రద్దు చేశారు.  

హలెప్‌ దూరం...
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) కాలి పిక్క గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఇదే గాయంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఆడలేకపోయిన సిమోనా శుక్రవారం తాను వింబుల్డన్‌లో ఆడటం లేదని ప్రకటించింది. మహిళల డబుల్స్‌ విభాగంలో భారత స్టార్‌ సానియా మీర్జా అమెరికాకు చెందిన బెథానీ మాటెక్‌ సాండ్స్‌తో కలసి ఆడనుంది. తొలి రౌండ్‌లో ఆరో సీడ్‌ అలెక్సా గురాచీ (చిలీ)–డెసిరె క్రాజిక్‌ (అమెరికా) జోడీతో సానియా –బెథానీ ద్వయం తలపడనుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న–దివిజ్‌ శరణ్‌ (భారత్‌) జోడీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంటతో ఆడుతుంది. 

>
మరిన్ని వార్తలు