IND Vs AUS: 'జట్టులో పంత్‌ ఎందుకు?'.. డీకే అదిరిపోయే రిప్లై

24 Sep, 2022 07:19 IST|Sakshi

నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆరంభిస్తే.. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ తనదైన ఫినిషింగ్‌తో ముగించాడు. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్‌, ఫోర్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కొంతకాలంగా చూసుకుంటే పంత్‌ జట్టులో ఉంటే కార్తిక్‌ ఉండకపోవడం.. కార్తిక్‌ ఉంటే పంత్‌ మ్యాచ్‌ ఆడకపోవడం లాంటివి జరుగుతూ వస్తుంది.

ఇద్దరు జట్టులో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కింది. ఇక పంత్‌ వికెట్‌ కీపర్‌గానే బాధ్యతలు నిర్వహించాడు. అయితే మ్యాచ్‌ విజయం అనంతరం దినేశ్‌ కార్తిక్‌ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో రెండో టి20లో పంత్‌ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ విలేకరులు ప్రశ్నించారు. దానికి డీకే అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

''వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌కు ఐదుగురు బౌలర్ల ఆప్షన్‌ అవసరం లేకుండా పోయింది. జట్టులో నలుగురు బౌలర్లు ఉంటే చాలు.. అయితే హార్దిక్‌ రూపంలో ఐదో బౌలర్‌ ఉండనే ఉన్నాడు. అందుకే ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో పంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఇంకో విషయమేంటంటే.. ఓవర్లు కుదించినప్పుడు స్పెషలిస్ట్‌ బ్యాటర్స్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే నాతో పాటు పంత్‌ కూడా జట్టులో ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో ఇలాగే కొనసాగుతుందా అంటే మాత్రం చెప్పలేను'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: IND vs AUS 2nd T20: భారత్‌ గెలుపు మెరుపులు

మరిన్ని వార్తలు