అప్పుడు పుజారా.. ఇప్పుడు సిబ్లీ.. అదే తరహాలో

6 Mar, 2021 13:33 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ సిబ్లీ అవుట్‌ అయిన విధానం అతన్ని నిరాశ పరిచింది. విషయంలోకి వెళితే.. అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నిం‍గ్స్‌ 9వ ఓవర్‌ చివరి బంతిని సిబ్లీ స్వీప్‌ షాట్‌కు యత్నించాడు. అయితే అతను కొట్టిన బంతి టీమిండియా ఫీల్డర్‌ గిల్‌ ప్యాడ్లను తాకి గాల్లోకి లేచింది. అప్పటికే క్యాచ్‌ అందుకునేందుకు ముందుకు వచ్చిన పంత్‌ బంతిని ఒడిసి పట్టాడు. అయితే అంపైర్‌ ఔట్‌ ఇచ్చిన అనుమానం ఉండడంతో థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో సిబ్లీ అవుట్‌ అని రావడంతో ఆశ్చర్యపోయిన సిబ్లీ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు.

అయితే సిబ్లీ అవుటైన విధానంలోనే పుజారా కూడా ఔటయ్యాడు. ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర్‌ పుజారా అచ్చం సిబ్లీ తరహాలోనే వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 51వ ఓవర్ వేసిన స్పిన్నర్ డొమినిక్ బెస్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా (73 పరుగులు) స్వ్కేర్ లెగ్ దిశగా బంతిని ఫుల్ చేశాడు. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ అయ్యింది. కానీ.. బంతి నేరుగా వెళ్లి షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ భుజానికి తాకి మిడాన్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఉన్న రోరీ బర్న్స్ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో పుజారాకు ఏం చేయాలో అర్థం కాక కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు.


ఈ రెండు యాదృశ్చికంగా ఒకే సిరీస్‌లో జరగడం విశేషం. సిబ్లీ అవుటైన వీడియోనూ పుజారా వీడియోతో షేర్‌ చేసి నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఏం బాధపడకు సిబ్లీ.. అప్పట్లో మా పుజారా కూడా ఇలాగే ఔటయ్యాడు. అప్పుడు పుజారా.. ఇప్పుడు సిబ్లీ అంటూ పేర్కొన్నారు. ఇక టీమిండియా నాలుగో టెస్టులో మరింత పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్‌ అయిన టీమిండియా లంచ్‌ విరామం తర్వాత ఇంగ్లండ్‌ నాలుగు కీలక వికెట్లు తీసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 119 పరుగులు చేయాల్సి ఉంది.
చదవండి:
పాపం.. దురదృష్టం అంటే పుజారాదే

మరిన్ని వార్తలు