ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌

22 Nov, 2020 06:35 IST|Sakshi

సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌పై విజయం

లండన్‌: ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్‌ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్‌ థీమ్‌ 7–5, 6–7 (10/12), 7–6 (7/5)తో గెలుపొందాడు.

రెండో సెట్‌లో నాలుగు మ్యాచ్‌ పాయింట్లు వదులుకున్న థీమ్‌... నిర్ణాయక మూడో సెట్‌ టైబ్రేక్‌లో ఒకదశలో 0–4తో వెనుకబడ్డాడు. కానీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన థీమ్‌ 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్‌ మరో పాయింట్‌ గెలిచినా... ఆ వెంటనే థీమ్‌ మరో పాయింట్‌ సాధించి 7–5తో టైబ్రేక్‌తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. థీమ్‌ కెరీర్‌లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), మెద్వెదేవ్‌ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్‌ ఆడతాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు