వాళ్ల అనుభవాన్ని వినియోగించుకోండి: ద్రవిడ్‌

14 Aug, 2020 09:02 IST|Sakshi

ముంబై: సాధ్యమైనంత వరకు మాజీ క్రికెటర్ల అనుభవాన్ని వినియోగించుకొని క్రికెట్‌ అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు సూచించాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వెబినార్‌లో పాల్గొన్న రాహుల్‌ ద్రవిడ్‌ అనుబంధ సంఘాలకు పలు కీలక సూచనలు చేశాడు. రాష్ట్ర సంఘాల కార్యదర్శులు, క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్స్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో ద్రవిడ్‌తో పాటు బీసీసీఐ–ఎన్‌సీఏ ఎడ్యుకేషన్‌ హెడ్‌ సుజిత్‌ సోమసుందర్, ట్రెయినర్‌  ఆశీష్‌ కౌశిక్‌ పాల్గొన్నారు. కోవిడ్‌–19 విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ శిక్షణా శిబిరాల పునరుద్ధరణ, ప్లేయర్ల పిట్‌నెస్‌ స్థాయి అంచనా వేసే పద్ధతులు, రాష్ట్ర సంఘాలకు తలెత్తే ఇబ్బందులకు పరిష్కారాల గురించి ఈ వెబినార్‌లో ద్రవిడ్‌ కూలంకషంగా వివరించినట్లు ఇందులో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు. 

‘రాష్ట్ర సంఘాల క్రికెట్‌ అభివృద్ధికి మాజీ ఆటగాళ్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి అని ద్రవిడ్‌ సూచించారు. అంతేగానీ వారి సేవలు ఉపయోగించుకోవడం తప్పనిసరి అని చెప్పలేదు. ఒకవేళ మాజీ ఆటగాళ్లు రాష్ట్ర జట్లతో చేరితే వారి అనుభవం వృథా కాకుండా జట్టుకు కలిసొస్తుందన్నారు’ అని ఆయన చెప్పారు. మరోవైపు రెండు పద్ధతుల్లో శిక్షణను పునరుద్దరించేందుకు ఎన్‌సీఏ ప్రయత్నిసున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా ఒకేసారి 25–30 మంది ఆటగాళ్లు కలిసి ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేదన్న ద్రవిడ్‌... రాష్ట్ర జట్ల ఫిజియోలు, ట్రెయినర్లు సగం మందికి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మిగతా సగానికి మైదానంలో శిక్షణ ఇవ్వాలని కోరారు. కౌశిక్‌ మాట్లాడుతూ క్రికెటర్లు క్రికెటింగ్‌ నైపుణ్యాలపై దృష్టి సారించినపుడు శారీరక సామర్థ్యాన్ని... బాడీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు స్కిల్స్‌ ట్రెయినింగ్‌ను కాస్త తక్కువ స్థాయిలో చేయాలని సూచించారు. ప్రతీ ఆటగాడి వ్యక్తిగత ఫిట్‌నెస్‌ డేటాను ఫిజియోలు భద్రపరుచుకోవాలని పునరావాస కార్యక్రమాల్లో ఈ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కౌశిక్‌ చెప్పారు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా