Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’

2 Oct, 2021 08:46 IST|Sakshi

Virender Sehwag comments on Mumbai indians: ఐపీఎల్ 2021లో లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. ప్లేఆఫ్‌ స్ధానాలను దక్కించకోవడం కోసం జట్లు మధ్య తీవ్రంగా పోటి నడుస్తోంది. కాగా గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈ ఏడాది పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టుపై భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.  

ఈ సీజన్‌లో ముంబై కాకుండా కొత్త జట్టు ఛాంపియన్‌గా అవతరించాలని ఆశిస్తున్నట్లు అతడు తెలిపాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింన సంగతి తెలిసిందే. కాగా 18 పాయింట్లతో  ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో స్ధానంలో ఉండగా, 16 పాయింట్లతో ఆర్సీబీ మూడవ స్ధానంలో ఉంది. అయితే నాల్గవ స్థానం కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. 

"ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని నేను కోరుకోను. ముంబై స్ధానంలో కొత్త జట్టు అర్హత సాధించాలి. మాకు కొత్త ఛాంపియన్‌ కావాలి. బెంగుళూరు, ఢిల్లీ లేక పంజాబ్ టైటిల్‌ గెలవాలి. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. వారు ఇప్పటివరకు ఐదు టైటిల్స్ గెలుచుకున్నారు. 

ముంబై ఇండియన్స్ వారి మిగిలిన మ్యాచ్‌లను గెలిస్తే, వారు సులభంగా ప్లేఆఫ్‌కు చేరుకోగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి మిగిలిన మ్యాచ్‌లు గెలిస్తే వారు 16 పాయింట్లు సాధిస్తారు. కానీ అది సులభం కాదు. కొన్నిసార్లు  గెలవాలని ఒత్తిడిలో కొన్ని  తప్పులు చేస్తారు. ఆ తప్పులు  వారి ఓటమికి దారితీస్తాయి" అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సెహ్వాగ్‌ చెప్పాడు. కాగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌ నేడు ఢిల్లీతో తలపడనుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే

మరిన్ని వార్తలు