T20 WC 2022: కోహ్లి, రోహిత్‌ రిటైరవుతారా?.. ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

10 Nov, 2022 21:32 IST|Sakshi

టి20 వరల్డ్కప్ 2022లో టీమిండియా కథ ముగిసింది. కచ్చితంగా ఫైనల్‌ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపులు లేకపోగా.. బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో ఓటమి దిశగా పయనించింది.

ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తమ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. డగౌట్‌ కూర్చొని కన్నీటి పర్యంతం కావడం సోషల్‌ మీడియాలో వైరలగా మారింది. ఇక కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతున్న సమయంలో.. ''సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్‌ అవ్వాల్సిన సమయం వచ్చేసిందా'' అని ప్రశ్నించారు. ఇప్పుడే ఈ విషయంపై మాట్లాడటం తొందరపాటు అవుతుందని బదులిచ్చాడు. కోహ్లి, రోహిత్‌లు ఎంతకాలం ఆడాలనేది వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకు ఇంకా చాలా సమయముందని పేర్కొన్నాడు.

అనంతరం విదేశీ టి20 లీగుల్లో భారత ఆటగాళ్లు ఆడితే గేమ్ బాగా మెరుగుపడుతుంది కదా? అనే ప్రశ్న వేయగా.. అలా చేస్తే దేశవాళీ టోర్నీలకు ముగింపు పలకడమే అవుతుందని ద్రవిడ్ స్పష్టం చేశారు. "ఇతర ఆటగాళ్ల మాదిరిగా ఇక్కడకు వచ్చి టోర్నమెంట్ ఆడితే బాగానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ భారత క్రికెట్‌కు ఇది చాలా కష్టం. ఈ టోర్నమెంట్‌లు చాలా వరకు మన సీజన్‌లో ఎక్కువగా జరుగుతాయి. ఫలితంగా ఇది మనకు సవాల్. మా ఆటగాళ్లలో చాలా మంది ఈ లీగుల్లో ఆడే అవకాశాలను కోల్పోతారు. అదీ కాకుండా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐకే ఉంది. విదేశీ లీగుల్లో ఆటగాళ్లను అనుమతిస్తే మన దేశవాళీ క్రికెట్ ఉందు. రంజీ ట్రోఫీకి చరమగీతం పలికినట్లే అవుతుంది" అని తెలిపాడు.

మరిన్ని వార్తలు