IND Vs SL: అంతలోనే ఇంత మార్పా..? అంతా ద్రవిడ్‌ మాయ అంటున్న నెటిజన్లు

19 Jul, 2021 16:49 IST|Sakshi

కొలంబో: నిన్న శ్రీలంకతో జరిగిన తొలి వ‌న్డేలో ధవన్‌ సారధ్యంలోని టీమిండియా అద్భుతంగా రాణించి మూడు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత నవ యువ కిషోరాలు మూకుమ్మడిగా రాణించడంతో టీమిండియా ఆతిధ్య శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ విజయంలో ఆటగాళ్ల ప్రతిభ కంటే, వారిపై కోచ్‌ ద్రవిడ్‌ ప్రభావం అధికంగా కనబడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు శ్రీలంక ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌లో జరిగిన ఓ ఘటనను ఉదహరిస్తున్నారు. కృనాల్ పాండ్యా బౌల్‌ చేస్తున్న ఆ ఓవ‌ర్లో స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ధ‌నంజ‌య డిసిల్వా ఉన్నాడు. 

అతను స్ట్రెయిట్‌గా కొట్టిన ఓ షాట్‌ను కృనాల్‌ డైవ్ చేస్తూ ఆప‌బోయిన క్ర‌మంలో.. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చ‌రిత్ అస‌లంక‌కు త‌న కాలు త‌గిలింది. దీంతో వెంట‌నే అత‌డు పైకి లేచి అస‌లంక‌ను హ‌గ్ చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హుందాతనానికి మారు పేరైన ద్ర‌విడ్ కోచ్‌గా రావ‌డం వ‌ల్లే కృనాల్‌ లాంటి ప్లేయ‌ర్స్‌లోనూ తక్కువ సమయంలో ఇంత మార్పు క‌నిపిస్తోందంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ది ద్ర‌విడ్ ఎఫెక్ట్ పేరుతో మిస్ట‌ర్ డిపెండ‌బుల్ నిన్న ట్విట‌ర్‌లో ట్రెండ్ అయ్యాడు. కొంద‌రైతే ర‌విశాస్త్రి కోచింగ్‌లో కృనాల్ ఎలా ఉండేవాడు.. ఇప్పుడు ద్ర‌విడ్ కోచింగ్‌లో ఇలా అయ్యాడంటూ ఫొటోలు షేర్‌ చేశారు. ద్ర‌విడ్‌ను శాశ్వతంగా టీమిండియా కోచ్‌గా చేస్తే.. యువ ఆట‌గాళ్ల‌కు ఇలాంటి మంచి ల‌క్ష‌ణాలు వ‌స్తాయ‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు