ద్రవిడ్‌ కెప్టెన్‌ కావడం వారికి ఇష్టం లేదు.. అందుకే అలా చేశారు

21 May, 2021 18:30 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికైనప్పుడు.. అతనికి జట్టు సభ్యులెవ్వరూ సహకరించలేదని, ముఖ్యంగా సీనియర్లకు ద్రవిడ్‌ కెప్టెన్‌ కావడం అస్సలు ఇష్టం లేదని భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో కోచ్‌గా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ద్రవిడ్ తన సారథ్యంలో భారత్‌ను నెంబరవన్ జట్టు‌గా తీర్చిదిద్దాలనుకున్నాడని, కానీ సహచర ఆటగాళ్ల మద్దతు అతని లభించలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా 2007 వన్డే ప్రపంచకప్‌లో ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు దారుణంగా విఫలమైన విషయాన్ని ప్రస్తావించాడు. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఆ మెగా టోర్నీలో భారత్‌ కనీసం సూపర్-8కు కూడా అర్హత సాధించకుండా నిష్క్రమించింది.  

తన హయాంలో కెరీర్ చివరి దశకు చేరిన సీనియర్లు జట్టులో స్థానం కాపాడుకోవడంపైనే దృష్టి సారించే వారని, వారికి జట్టు ప్రయోజనాలు అస్సలు పట్టేవి కావని ఆయన ఆరోపించాడు. అయితే గంగూలీపై వేటు పడటంతో ఆటగాళ్ల వైఖరిలో మార్పు వచ్చిందన్నాడు. గంగూలీకి జట్టు ప్రయోజనాల కంటే తన కెప్టెన్సీపైనే ఎక్కువ మక్కువ ఉండేదని సంచలన ఆరోపణలు చేశాడు. గంగూలీ వల్లే తనకు టీమిండియా కోచ్‌గా పనిచేసే అవకాశం దక్కిందని వెల్లడించాడు. రెండేళ్ల పదవీ కాలం ముగిశాక కూడా తననే కోచ్‌గా కొనసాగమని బీసీసీఐ కోరిందని, కానీ ఆ ఒత్తిడి అవసరం లేదని స్వచ్చందంగా తప్పుకున్నాని చెప్పుకొచ్చాడు. కాగా, ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు 25 టెస్ట్‌లు, 79 వన్డేలు ఆడి 50 విజయాలందుకుంది.   

ఇదిలా ఉంటే, గ్రెగ్ చాపెల్‌ పర్యవేక్షణలోని టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అతను చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి. అప్పటికే బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్న ఇర్ఫాన్ పఠాన్‌ను ఓపెనర్‌గా పంపి.. అతడి కెరీర్ నాశనానికి కారకుడయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎన్నో మార్పులు చేశాడు. ఇక గంగూలీ కెప్టెన్సీ చేజారడం, తుది జట్టులో స్థానం కోల్పోవడం వంటి సంఘటనలు అతని హయాంలోనే చోటు చేసుకున్నాయి. దీంతో 2007 ప్రపంచకప్‌లో భారత్.. పసికూన బంగ్లాదేశ్‌తో పాటు శ్రీలంక చేతిలో కూడా ఓడి అత్యంత అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక చాపెల్‌ను టీమిండియా కోచ్‌గా తీసుకురావడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని గంగూలీ తన ఆత్మ కథ ‘ఏ సెంచరీ నాట్ ఏ ఎనఫ్'‌లో రాసుకొచ్చాడు.
చదవండి: కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపాను..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు