'రోహిత్‌ ఇది‌​ నాది.. వెళ్లి సొంత బ్యాట్‌ తెచ్చుకో'

16 Sep, 2020 12:02 IST|Sakshi

దుబాయ్‌ : రోహిత్‌ శర్మ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు.. అందుకే అతన్ని ముద్దుగా హిట్‌మ్యాన్‌ అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రోహిత్‌ శర్మకు సొంత బ్యాట్‌ కూడా లేదంట. అదేంటి.. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం దుబాయ్‌లో ఉన్నాడు కదా.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ వద్ద సొంత బ్యాట్‌ లేకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ 2020కి సంబంధించి డ్రీమ్‌ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఐపీఎల్‌ స్పాన్సర్‌గా వివో తప్పుకున్న నేపథ్యంలో ఏడాది కాలానికి గానూ రూ.250 కోట్లతో డ్రీమ్‌ లెవెన్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది.(చదవండి : స్టోక్స్‌ ఆడతాడో... లేదో...!) 

ఈ సందర్భంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లతో ప్రమోషనల్‌ వీడియోలు చేస్తున్న డ్రీమ్‌ 11 సంస్థ తాజాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రమోషనల్‌ వీడియో ఒకటి విడుదల చేసింది. ఆ వీడియోలో రోహిత్‌ గల్లీ క్రికెట్‌ ఆడుతుంటాడు. చేతిలో బ్యాట్‌ పట్టుకొని హిట్టింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న రోహిత్‌ను ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నావ్‌ అని అడుగుతాడు.. దానికి ఓపెనింగ్‌ చేస్తున్నా అంటూ హిట్‌మ్యాన్‌ సమాధానమిస్తాడు. ఎంతైనా తాను ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను కదా అంటూ నవ్వుతూ పేర్కొంటాడు. దీనికి అవతలి వ్యక్తి నీ చేతిలో ఉన్న బ్యాట్‌ ఎవరిది అని అడుగుతాడు.. దానికి రోహిత్‌ తటపటాయిస్తూ.. బ్యాట్‌ నీదేనా అని అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి రోహిత్‌ చేతిలో ఉన్న బ్యాట్‌ లాక్కుంటూ.. అవును బ్యాట్‌ నాదే.. వెళ్లి నీ సొంత బ్యాట్‌ తెచ్చుకో.. అప్పటివరకు ఫీల్డింగ్‌ చేయ్‌ అంటూ పక్కకు నెట్టేస్తాడు. దాంతో రోహిత్‌ బిత్తరచూపులు చూస్తుండగా వీడియో ముగుస్తుంది. (చదవండి : షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా)

దీనిపై ముంబై ఇండియన్స్‌ సహచరుడు , బౌలర్‌ జస్‌ప్రీత్‌  బుమ్రా వీడియో ట్విటిర్‌లో షేర్‌ చేస్తూ కామెంట్‌  చేశాడు. రోహిత్‌ బాయ్‌.. అది మన క్రికెట్‌ కాదు.. గల్లీ క్రికెట్‌. నీ సొంత బ్యాట్‌ తెచ్చుకొని బరిలోకి దిగు.. అంటూ కామెంట్‌ జత చేశాడు. బుమ్రా షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  కాగా సెప్టెంబర్‌ 19న మొదలుకానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు