తొలి రోజు ఆట అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందో చూడండి..!

14 Aug, 2021 09:50 IST|Sakshi

లండ‌న్‌: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌(127 నాటౌట్‌) సూపర్‌ శతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, తొలి రోజు ఆట ముగిసిన అనంతరం​ టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో లభించిన అపురూపమైన స్వాగతం రాహుల్‌కు జీవితాంతం గుర్తుండిపోతుంది. కోచ్ ర‌విశాస్త్రి స‌హా జట్టు స‌భ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలుకుతూ అతనికి అభినందనలు తెలిపారు. క్రికెట్ మ‌క్కాగా భావించే ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్‌లో సెంచ‌రీ చేసినందుకు గాను అతని పేరును బాల్క‌నీలోని సెంచ‌రీ హీరోల లిస్ట్‌లో చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. 

కాగా, రాహుల్‌ కంటే ముందు కేవలం ఇద్దరు భారత ఓపెనర్లు మాత్రమే ఈ మైదానంలో శతకొట్టారు. 1990లో రవిశాస్త్రి, 1952లో వినోద్‌ మన్కడ్‌లు మాత్రమే లార్డ్స్‌లో సెంచరీ సాధించిన భారత ఓపెనర్లు. ఇదిలా ఉంటే, తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్‌ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్‌ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను 364 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఆండర్సన్‌ 5, రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌ తలో 2 వికెట్లు, మొయిన్‌ అలీ ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్‌(2/34) దెబ్బతీయగా, బర్న్స్‌(49), రూట్‌(48 బ్యాటింగ్‌) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు