డక్‌వర్త్‌ కన్‌ఫ్యూజన్‌: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా

30 Mar, 2021 18:27 IST|Sakshi

నేపియ‌ర్‌: క్రికెట్ ప్రేమికులు అంపైర్స్‌ కాల్‌ కన్‌ఫ్యూజన్‌ నుంచి తేరుకోక ముందే మరో అర్ధం కాని సమస్య తెరముందుకొచ్చింది. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి, సరికొత్త కన్‌ఫ్యూజన్‌కు దారి తీసింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ ఆడుతున్న బంగ్లా జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిపై సరైన అవగాహన లేక, తప్పుడు టార్గెట్‌ను నిర్ధేశించుకొని బరిలోకి దిగింది. ఆతరువాత మ్యాచ్‌ రిఫరీ సైతం సరికొత్త రూల్స్‌ విషయంలో తికమకపడి లక్ష్యాన్ని రెండోసార్లు మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం కన్‌ఫ్యూజన్‌కు మారిన ఐసీసీ రూల్సే కారణమని అంటున్నారు విశ్లేషకులు. 

వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ జట్ల మ‌ధ్య జరిగిన రెండో టీ20కి వ‌ర్షం అడ్డుప‌డింది. ఆ స‌మయానికి న్యూజిలాండ్ 17.5 ఓవ‌ర్లలో 173 ప‌రుగులు చేసింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌కు 16 ఓవ‌ర్లలో 170 ప‌రుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే మారిన డ‌క్‌వ‌ర్త్ లూయిస్ పద్ధతిపై సరైన అవగాహన లేని బంగ్లా జట్టు, తాము ఛేజ్ చేయాల్సింది 16 ఓవ‌ర్లలో 148 ప‌రుగులు అని భావించి బ‌రిలోకి దిగింది. ఈ క్రమంలో 1.3 ఓవ‌ర్ల త‌ర్వాత గంధరగోళానికి లోనై మ్యాచ్‌ రిఫరీని సంప్రదించగా, ఆయన మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. 

10 నిమిషాల చర్చల అనంతరం తిరిగి ప్రారంభంమైన మ్యాచ్‌లో తొలుత బంగ్లాకు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన మ్యాచ్‌ రిఫరీ.. ఆతరువాత దాన్ని 16 ఓవర్లలో 171 పరుగులుగా మార్చాడు. దీంతో మ్యాచ్‌ మధ్యలో పెద్ద హైడ్రామానే నెలకొంది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్‌ కొత్త రూల్స్‌ విషయంలో బంగ్లా జట్టు కన్‌ఫ్యూజ్‌ అయ్యిందంటే ఒక అర్ధముంది, ఏకంగా మ్యాచ్‌ రిఫరీనే కన్‌ఫ్యూజ్‌ అయ్యాడంటే రూల్స్‌ ఎంత తికమక పెడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు క్రికెట్‌ అభిమానులు. కాగా, 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు 16 ఓవ‌ర్లలో 143 ప‌రుగులు మాత్రమే చేసి ఓట‌మి పాలైంది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-0తేడాతో కైవసం చేసుకుంది. 
చదవండి: హార్ధిక్‌ తన బ్యాటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకున్నాడు..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు