Duleep Trophy 2022 2nd Semi Final Day 1: హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్‌ దిశగా సౌత్‌ జోన్‌

15 Sep, 2022 18:33 IST|Sakshi

దులీప్‌ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 15) సౌత్‌ జోన్‌-నార్త్‌ జోన్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌత్‌ జోన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ రోహన్‌ కున్నమ్మల్‌ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) సూపర్‌ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్‌) పరుగు తేడాతో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్‌ జోన్‌ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్‌ (37 బంతుల్లో 20; ఫోర్‌) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్‌ జోన్‌ బౌలర్లలో నవ్‌దీప్‌ సైనీ, నిశాంత్‌ సింధుకు తలో వికెట్‌ దక్కింది.  

మరోవైపు, కొయంబత్తూర్‌ వేదికగా సెంట్రల్‌ జోన్‌-వెస్ట్‌ జోన్‌ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న వెస్ట్‌ జోన్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్‌ త్రిపాఠి (64 నాటౌట్‌) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు షమ్స్‌ ములానీ (41), తనుష్‌ కోటియన్‌ (36) పర్వాలేదనిపించారు.

వెస్ట్‌ జోన్‌ను సెంట్రల్‌ జోన్‌ స్పిన్నర్‌ కుమార్‌ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్‌ రాజ్‌పుత్‌, అనికేత్‌ చౌదరీ, గౌరవ్‌ యాదవ్‌, కరణ్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్‌ త్రిపాఠికి జతగా చింతన్‌ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు.  
 

మరిన్ని వార్తలు