645 పరుగుల తేడాతో భారీ విజయం: కొత్త రికార్డు నమోదు

19 Sep, 2022 06:38 IST|Sakshi

నార్త్‌జోన్‌పై సౌత్‌జోన్‌ రికార్డు విజయం 

కోయంబత్తూర్‌: దేశవాళీ జోనల్‌ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదైంది. ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్‌జోన్‌ ఏకంగా 645 పరుగుల భారీ తేడాతో నార్త్‌జోన్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. దులీప్‌ ట్రోఫీ చరిత్రలో పరుగుల తేడాపరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 157/1తో ఆదివారం ఆట కొనసాగించిన సౌత్‌జోన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 316 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

హైదరాబాద్‌ క్రికెటర్‌ టి.రవితేజ (104 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించడం విశేషం. అనంతరం 740 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్‌జోన్‌ 30.4 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. తనయ్‌ త్యాగరాజన్, సాయికిశోర్, కృష్ణప్ప గౌతమ్‌ తలా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన సాయికిశోర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. మరో సెమీస్‌లో సెంట్రల్‌జోన్‌ను 279 పరుగులతో ఓడించి వెస్ట్‌జోన్‌ ఫైనల్‌ చేరింది.

మరిన్ని వార్తలు