Dwaine Pretorius: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం.. ఆటకు గుడ్‌ బై! ఇకపై..

9 Jan, 2023 14:42 IST|Sakshi

South Africa All Rounder Dwaine Pretorius: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని సోమవారం ప్రకటించాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా  క్రికెట్‌ బోర్డు సైతం ధ్రువీకరించింది.

ఈ మేరకు.. ‘‘క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నేను అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నా. ప్రొటిస్‌కు ఆడాలనే ఆశయంతో వచ్చిన వాడిని. 

ఇక్కడిదాకా ఎలా రాగలిగానో నాకే తెలియదు. అయితే, దేవుడిచ్చిన ప్రతిభాపాటవాలు, ఆట పట్ల నిబద్ధత చూపగల లక్షణం నేను విజయవంతమయ్యేలా చేశాయి. ఇక ముందు కూడా నా భవిష్యత్తు ఆయనే నిర్ణయిస్తాడు’’ అంటూ తన రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా ప్రిటోరియస్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.

టీ20ల కోసమే..
‘‘మున్ముందు టీ20, ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి సారిస్తాను. ఎలాంటి బంధనాలు లేని ఆటగాడిగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే నాకు నచ్చినట్లుగా నేను ఆడగలిగే స్వేచ్ఛ లభించింది. ఈ నిర్ణయం ద్వారా ఇటు ఆటతో పాటు కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయించగలుగుతాను. నా ప్రయాణంలో ఇంతవరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

ఫాఫ్‌ డు ప్లెసిస్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. నన్ను మళ్లీ జట్టులోకి రప్పించి.. నన్ను నేను మరింత మెరుగైన ఆటగాడిగా మలచుకోవడంలో నాకు సహాయపడినందుకు ఫాఫ్‌నకు థాంక్యూ’’ అని ప్రిటోరియస్ తన నిర్ణయం వెనుక గల కారణాలు వెల్లడించాడు. కాగా 33 ఏళ్ల డ్వేన్‌ ప్రిటోరియస్‌ ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు.

ఆరేళ్ల కాలంలోనే..
2016లో ఐర్లాండ్‌తో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ప్రిటోరియస్‌.. ప్రొటిస్‌ తరఫున 30 టీ20, 27 వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రెండు వరల్డ్‌కప్‌ టోర్నీల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే అతడి కెరీర్‌లో చివరిది.

చదవండి: Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్‌ ట్వీట్‌! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్‌ ఫైర్‌
Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు