Dwayne Bravo: ‘ఐపీఎల్‌కు గుడ్‌బై’ చెప్పిన మరో దిగ్గజం.. బంపరాఫర్‌ ఇచ్చిన సీఎస్‌కే.. ఇకపై

2 Dec, 2022 15:51 IST|Sakshi
డ్వేన్‌ బ్రావో (PC: CSK)

Dwayne Bravo- Chennai Super Kings: మరో వెస్టిండీస్‌ దిగ్గజ ప్లేయర్‌ డ్వేన్‌ బ్రావో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇకపై ఆటగాడిగా కొనసాగబోనని స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు బ్రావో సుదీర్ఘ కాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

సీఎస్‌కేను చాంపియన్‌గా నిలపడంతో తన వంతు పాత్ర పోషించాడు ఈ రైట్‌ఆర్మ్‌ పేసర్‌. ఈ క్రమంలో ఐపీఎల్‌-2023 మినీ వేలం నేపథ్యంలో అతడిని రిలీజ్‌ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. 

బ్రావోకు బంపరాఫర్‌!
అయితే, సుద్ఘీకాలం తమకు సేవలు అందించిన బ్రావోకు.. చెన్నై ఫ్రాంఛైజీ బంపరాఫర్‌ ఇచ్చింది. డ్వేన్‌ బ్రావోను సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సీఎస్‌కే సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌.. ఐపీఎల్‌లో విజయవంతంగా కెరీర్‌ కొనసాగించిన బ్రావోకు అభినందనలు తెలిపారు.

సూపర్‌కింగ్స్‌ కుటుంబంలో దశాబ్దకాలంగా కీలక సభ్యుడిగా ఉన్న బ్రావోతో తమ అనుబంధం కొనసాగుతుందని.. అతడిని బౌలింగ్‌ కోచ్‌గా నియమించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ సైతం ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు వచ్చే సీజన్‌లో అదే జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

అత్యధిక వికెట్ల వీరుడు
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్టు పడగొట్టిన ఆటగాడిగా డ్వేన్‌ బ్రావో రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో మొత్తంగా 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 183 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా 1560 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

2011లో సీఎస్‌కేకు ఆడటం మొదలుపెట్టిన బ్రావో.. 2011, 2018, 2021లో జట్టును చాంపియన్‌గా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 2014 నాటి చాంపియన్స్‌ లీగ్‌ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. 2013, 2015లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రెండుసార్లు పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.  

చదవండి: Ricky Ponting: రికీ పాంటింగ్‌కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు
Rashid Khan: కెప్టెన్లుగా కీరన్‌ పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌.. ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు