#MS Dhoni: ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే

1 Jun, 2023 07:51 IST|Sakshi
ఎంఎస్‌ ధోనితో డ్వేన్‌ బ్రావో (PC: IPL)

IPL 2023 Winner CSK: వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోకు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు చెన్నై ఫ్రాంఛైజీతో కొనసాగిన బ్రావో.. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. 2011లో సీఎస్‌కేకు తొలిసారి ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2011, 2018, 2021 సీజన్లలో ధోని సేన టైటిల్‌ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు.

అదే విధంగా 2014 నాటి చాంపియన్స్‌ లీగ్‌ గెలిచిన ధోని సేనలో బ్రావో సభ్యుడు కూడా! అంతేగాక క్యాష్‌ రిచ్‌లీగ్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ ముందు వరుసలో నిలిచాడు. 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 183 వికెట్లు తీయడంతో పాటుగా.. 1560 పరుగులు సాధించాడు.

సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌గా
ఇలా సీఎస్‌కేతో అనుబంధం పెనవేసుకున్న డ్వేన్‌ బ్రావో గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని బౌలింగ్‌ కోచ్‌ నియమిస్తూ తమతోనే కొనసాగేలా చేసింది ఫ్రాంఛైజీ. ఇక సీఎస్‌కే ముఖచిత్రమైన కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనినే ఇందుకు ప్రధాన కారణం అంటున్నాడు బ్రావో.

ధోని నుంచి వచ్చిన ఆ ఒక్క కాల్‌ వల్లే
‘‘ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు! విజయవంతమైన ఐపీఎల్‌ కెరీర్‌కు గతేడాది రిటైర్మెంట్‌ ప్రకటించడం నా జీవితంలో విచారకరమైన సమయం. అయితే, ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ ఐపీఎల్‌లో కొనసాగాలని నా నుదుటి రాతలో రాసిపెట్టింది. మహేంద్ర సింగ్‌ ధోని.. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ నుంచి వచ్చిన ఒ‍్క ఫోన్‌ కాల్‌ నన్ను కోచింగ్‌ స్టాఫ్‌లో భాగం చేసింది. నా క్రికెట్‌ కెరీర్‌లో ముందుకు సాగేందుకు ఇదే సరైన దిశ అనిపించింది. 

కంగ్రాట్స్‌
ఆ దేవుడు.. క్రికెటర్‌గా నాకు ప్రసాదించిన నైపుణ్యాలను ఇకపై ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న సమయంలో కోచ్‌గా కొత్త అవతారం ఎత్తడం.. అది కూడా ఐపీఎల్‌ హిస్టరీలో విజయవంతమైన చరిత్ర ఉన్న జట్టుకు కోచ్‌గా ఉండటం అద్భుతం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తన మనసులోని మాటను పంచుకన్న బ్రావో.. సీఎస్‌కే బౌలర్లు దీపక్‌ చహర్‌, మతీశ పతిరణ, రాజ్యవర్థన్‌ హంగార్కర్‌,  రవీంద్ర జడేజా తదితరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌-2023 విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌కు విజయోత్సవాలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు.

చదవండి: Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు
మధ్యలో డిస్టర్బ్‌ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్‌..పైగా..

A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47)

మరిన్ని వార్తలు