U19 World Cup 2022: మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. 

30 Jan, 2022 14:55 IST|Sakshi

కరీబియన్‌ దీవులు వేదికగా జరుగుతున్న పురుషుల అండ‌ర్-19 ప్రపంచ‌క‌ప్‌ 2022లో భూకంపం సంభవించింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ మైదానంలో ఐర్లాండ్‌, జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా దాదాపు 20 సెకెన్ల పాటు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.2గా నమోదైంది.


అయితే భూమి కంపించిన సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లకు విషయం తెలియకపోవడం విశేషం. జింబాబ్వే ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ సందర్భంగా భూ ప్రకంపనలు సంభవించినట్లు కొద్దిసేపటి తర్వాత కామెంటేట‌ర్లు చెప్పడంతో విషయం తెలిసింది. భూకంపం సమయానికి కెమెరాలు షేక్‌ అవుతున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఐర్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘ‌న‌ విజ‌యం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ముజామిల్‌ షెర్జాద్‌(5/20) ధాటికి 48.4 ఓవర్లలో 166 ప‌రుగుల‌కే ఆలౌట్‌ కాగా, ఛేదనలో ఐర్లాండ్ కేవలం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 32 ఓవ‌ర్ల‌లోనే లక్ష్యాన్ని చేరుకుంది. జాక్ డిక్సన్ 78, కెప్టెన్‌ టిమ్ టెక్టర్ 76 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు.
చదవండి: "భార‌త్‌ను నెం1గా నిల‌పాల‌ని క‌ష్ట‌ప‌డ్డాడు.. మ‌రో రెండేళ్లు కెప్టెన్‌గా ఉండాల్సింది"

మరిన్ని వార్తలు