తీవ్ర విషాదం: ఛాతీకి బలంగా తగిలిన ఫుట్‌బాల్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి ఆపై గుండెపోటుతో కన్నుమూత

20 Mar, 2022 16:54 IST|Sakshi

కోల్‌కతా: ఆటలోనూ ఎప్పుడు ఏ పరిణామం జరిగిందో చెప్పడం కష్టం. పేదింటి బిడ్డ. ఆటను నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి ఆటగాడి జీవితాన్ని విధి వెక్కిరించింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగాల్‌ ఫుట్‌బాల్‌ యువ కెరటం దేబోజ్యోతి ఘోష్‌(25) మ్యాచ్‌ మధ్యలో గాయపడి.. ఆపై గుండె పోటుతో కన్నుమూశాడు.  ఈ హాఠాత్‌ పరిణామంతో తోటి ఆటగాళ్లంతా కన్నీరుమున్నీరు అయ్యారు. 

శనివారం దుబులియా బెల్పుకూర్ గ్రౌండ్‌లో నబాబ్ద్వీప్ సేవక్ సమితి, కృష్ణానగర్ సెంట్రల్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఘోష్ పాల్గొన్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దేబోజ్యోతి ఫుట్‌బాల్‌ బలంగా తాకింది. దీంతో అతడు స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. వెంటనే మ్యాచ్‌ నిర్వహకులు అతడిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా వాంతులు చేసుకున్న అతన్ని.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కృష్ణానగర్‌ షక్రిగఢ్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఈ లోపే అతను కన్నుమూశాడు. గుండెపోటుతోనే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 

దేబోజ్యోతికి బెంగాల్‌ ఫుట్‌బాల్‌ సంచలనంగా ఓ పేరుంది. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆ కుటుంబానికి అతనే ఆసరా కూడా. గతంలో సంతోష్ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా గత ఏడాది కలకత్తా ఫుట్‌బాల్ లీగ్‌లో  రైల్వేస్‌ తరుపున దేబోజ్యోతి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇందుగానూ.. ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అధికారులు ‘కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్-2022’ కోసం అతడిని ఎంపికచేశారు. ఈలోపే అతని జీవితం విషాదంగా ముగిసింది.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ అభిమానులకు బిగ్‌ షాక్‌.. ఇక కష్టమే!

మరిన్ని వార్తలు