జాతి వివక్ష: చిక్కుల్లో పడిన మోర్గాన్‌, బట్లర్‌

9 Jun, 2021 12:42 IST|Sakshi

లండన్‌: సోషల్‌ మీడియా వేదికగా చేసిన జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు ఇంగ్లండ్ క్రికెట్‌ను కుదిపేస్తున్నాయి. ఇంగ్లండ్‌ యువ బౌల‌ర్ ఓలీ రాబిన్‌స‌న్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివ‌క్ష ట్వీట్లను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. అతని ట్వీట్స్‌పై విచార‌ణ ప్రారంభించిన ఈసీబీ పలువురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు గతంలో చేసిన పాత ట్వీట్లను వెలికితీస్తోంది. ఇప్పుడు ఈ వివాదం ప్రస్తుత ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మెర్గాన్‌తో పాటు వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌లను చిక్కుల్లో పడేలా చేసింది. దీనిపై టెలిగ్రాఫ్‌ పత్రిక ఒక కథనం విడుదల చేసింది. 

టెలిగ్రాఫ్‌ కథనం ప్రకారం.. ఐపీఎల్‌లో కోల్‌క‌తా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వికెట్ కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ కూడా గ‌తంలో ఇండియ‌న్స్‌ను వెక్కిరిస్తూ పలు ట్వీట్లు చేశారు. మోర్గాన్‌, బ‌ట్ల‌ర్ ఇద్ద‌రూ స‌ర్ అనే ప‌దం ప‌దే ప‌దే వాడుతూ ఇండియ‌న్స్‌ను వెక్కిరించారు. కావాల‌ని త‌ప్పుడు ఇంగ్లిష్ వాడుతూ చేసిన ఆ ట్వీట్లు ఇండియ‌న్స్‌ను వెక్కిరించేలాగానే ఉన్న‌ట్లు ఈసీబీ భావిస్తోంది. 2018 ఐపీఎల్ సంద‌ర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారు. బ‌ట్ల‌ర్ ఆ ట్వీట్ల‌ను తొల‌గించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఈ ఇద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాలో వ‌ద్దో నిర్ణ‌యిస్తామ‌ని ఈసీబీ చెప్పిన‌ట్లు టెలిగ్రాఫ్ వెల్ల‌డించింది. రాబిన్‌స‌న్‌ను స‌స్పెండ్ చేసిన త‌ర్వాత వీళ్ల పాత‌ ట్వీట్లు కూడా వైర‌ల్ అయ్యాయి.

మ‌రోవైపు ఇంగ్లండ్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్‌పైనా విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది. 2010లో అత‌డు త‌న స‌హ‌చ‌ర బౌల‌ర్ బ్రాడ్ హెయిర్‌క‌ట్‌పై స్పందిస్తూ.. 15 ఏళ్ల లెస్బియ‌న్‌లా క‌నిపిస్తున్నాడంటూ అండ‌ర్స‌న్ ట్వీట్ చేశాడు. దీనిపై అండ‌ర్స‌న్ స్పందిస్తూ.. ఎప్పుడో ప‌దేళ్ల కింద‌ట అలా చేశాన‌ని, ఇప్పుడు తానో వ్య‌క్తిగా మారిపోయాన‌ని, త‌ప్పులు జ‌రుగుతూనే ఉంటాయ‌ని ఈ మధ్యే వివరణ ఇచ్చుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారుతున్న ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది. మొదటి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టు జూన్‌ 10 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఇంగ్లండ్‌ జట్టు టీమిండియాతో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14వరకు ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.
చదవండి: జాతి వివక్ష: మరో ఇంగ్లండ్‌ క్రికెటర్‌పై వేటు పడనుందా! 

కేన్ విలియమ్సన్‌ మోచేతికి గాయం.. కివీస్‌లో కలవరం

మరిన్ని వార్తలు