ICC Meeting: నాలుగో దేశాల టీ20 క్రికెట్‌ టోర్నీలకు పెరుగుతు​న్న డిమాండ్‌.. 

9 Apr, 2022 20:28 IST|Sakshi

భారత్‌, పాక్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దేశాలను కలుపుకుని నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత కొన్ని రోజులుగా ఐసీసీని విన్నవించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై చర్చించేందుకు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) నిన్న (ఏప్రిల్‌ 8) దుబాయ్‌లో సమావేశమైంది. క్వాడ్రాంగ్యులర్ టీ20 సిరీస్‌ల విషయంలో పాక్‌ మొదలు పెట్టిన పాటను, ఈ సమావేశం వేదికగా మరో రెండు దేశాల బోర్డులు అందుకున్నాయి. పాక్‌ ప్రతిపాదించిన తరహాలోనే టీ20 సిరీస్‌లు నిర్వహించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఐసీసీకి విజ్ఞప్తి చేశాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సైతం ఆయా దేశాలు ఐసీసీ ముందుంచాయి. 

పీసీబీ ప్రతిపాదించిన టోర్నీ విషయమై చర్చిద్దామని  సమావేశం ఏర్పాటు చేస్తే తాజాగా మరో రెండు దేశాల బోర్డులు అదే తరహా ప్రతిపాదనతో ముందుకు రావడంతో ఐసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే, పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా ఆదివారం సాయంత్రం క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను ఐసీసీ ముందుంచనున్నాడు. తమ ప్రతిపాదనతో ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులకు భారీ ఆదాయం సమకూరడంతో పాటు ప్రేక్షకులకు సైతం అమితమైన వినోదం ఉంటుందని పీసీబీ ఐసీసీని కన్విన్స్‌ చేయనుందని సమాచారం. తటస్థ వేదికలపై ఈ సిరీస్‌ నిర్వహణకు అవకాశమివ్వాలని పీసీబీ ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: భర్త ఐపీఎల్‌లో ఇరగదీస్తుంటే.. భార్య భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టింది..!

మరిన్ని వార్తలు